January 23, 2020

అంతుబట్టని కోటంరెడ్డి అంతరంగం – తమ్ముడికి బాధ్యతల వెనుక అసలు రహస్యం ఇదేనా ?

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో రాజకీయ ఉద్దండుల జాబితాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చేరిపోయారు. ఏబివిపి కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుగులు, అవమానాలు, చీకటి రోజులను చూసిన కోటంరెడ్డి తన రాజకీయ చతురతతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కోసం వివాదాలను సైతం ఎదుర్కొని ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వరుసగా రెండో దఫా ఎమ్మెల్యేగా విజయం సాధించి తన సత్తా చాటుకున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సిద్ధాంతాన్ని నమ్మే కోటంరెడ్డి… నియోజకవర్గంలోని ప్రతీ ఇంటిలో తానూ ఒక బిడ్డనే అని తరచూ అంటూ వారి కష్టాల్లో పాలుపంచుకుంటుంటారు.

ఇంత వరకూ బాగానే ఉన్నా తాజాగా కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ పూర్తి బాధ్యతలను తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అప్పగించడం వెనుక ఉన్న రహస్యమేంటనీ చెవులు కొరుక్కుంటున్నారు. సాధారణంగా అయితే ఏ నాయకుడు అయినా తానే అధికారంలో ఉండాలి అని అనుకుంటారు. పూర్తిగా రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత కుటుంబంలో వారసులను రంగ ప్రవేశం చేయిస్తారు. వారసులు లేకపోతే తానే ఉండాలని అనుకుంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం. మన జిల్లాలోనే చూసుకుంటే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా తమ్ముడు గిరిధర్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించడం వెనుక కోటంరెడ్డి అంతరంగం అర్దం కావడం లేదు. వాయువేగంతో రాజకీయ సమీకరణలను అంచనా వేయగలరని పేరున్న కోటంరెడ్డి, తమ్ముణ్ని తెరపైకి తీసుకురావడం వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తమ్ముడ్ని రూరల్ నియోజకవర్గంలో బలమైన నేతగా తయారుచేసి ఆయన మరేదైనా అంతకంటే పెద్ద స్థానంలోకి వెళ్లనున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నెల్లూరు రెండు నియోజకవర్గాలుగా ఉంది. 2024 ఎన్నికల్లోపూ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా మారనుంది. నెల్లూరు ఈస్ట్, నెల్లూరు వెస్ట్, నెల్లూరు రూరల్ ఇలా మూడు నియోజకవర్గాలుగా విభజన జరగనుంది. ఈ నేపద్యంలో నూతనంగా ఆవిర్భవించనున్న నియోజకవర్గంపై కోటంరెడ్డి కన్నేశారా అనే చర్చ కూడా సాగుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… కోటంరెడ్డికి బలమైన హామీ ఏదైనా ఇచ్చారా ఇస్తే అది రాష్ట్ర స్థాయిలో ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. పార్టీ పరంగా కోటంరెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే తమ్ముడు గిరిధర్ రెడ్డిని జిల్లా అధికారులందరికీ పరిచయం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇకపై నియోజకవర్గానకి సంభందించిన అన్నీ వ్యవహారాలు తమ్ముడే చూస్తాడు… తనకు ఇచ్చే ప్రాధాన్యాన్నే తన సోదరునిగి కూడా ఇవ్వాలని స్పష్టంగా తెలియజేశారు.

ఆదివారం తమ్ముడికి బాధ్యతలు అప్పగించన తర్వాత మంత్రి అనీల్, ఇతర నేతలతో కోటంరెడ్డి అన్న మాటలు కూడా దానికి బలం చేకూర్చుతున్నాయి. నా తమ్ముడు అమాయకుడు…. రాజకీయాలు మీరే నేర్పాలి… అంటూ వారితో అన్నారు. కోటంరెడ్డి నిర్ణయం వెనుక ఉన్న అంతరంగం ఏంటోనని వైసీపి నేతలే తలలు పీక్కుంటున్నారు. అధినేత జగన్ అండ, హామీ లేకుండా కోటంరెడ్డి ఆ నిర్ణయం తీసుకోరు అని కూడా అంచనా వేస్తున్నారు. ఇంతకీ జగన్ ఇచ్చిన హామీ… భరోసా ఏంటో తెలుసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తమ్ముడ్ని రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే కోటంరెడ్డి నిర్ణయం వెనుక అసలు రహస్యం ఏంటని ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆయనకే ఫోన్ చేసి మాటల సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా పార్టీని రాష్ట్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఇకపై రాజధాని అమరావతిలోనే ఉంటానని, తాను లేని లోటు నియోజకవర్గ ప్రజలకు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆ బాధ్యతలను గిరికి అప్పగిస్తున్నట్లు వారితో అన్నట్లు సమాచారం. అయితే కోటంరెడ్డి చెప్పే సమాధానాన్ని వారు నమ్మడం లేదు. ప్రత్యక్షంగా గానీ, తెరవెనుక గానీ రాజీకీయ వ్యూహాలు రచించండంలో దిట్ట అయిన కోటంరెడ్డి నిర్ణయం వెనుక ఏదో ఉంది అనుకుంటున్నారు. ఇంతకీ అదేంటో భవిష్యత్తులో తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!