November 19, 2019

పలు విద్యా సంస్థల్లో ఆదివారం తరగతులు – అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్ నేతలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పలు విద్యా సంస్థల్లో శెలవు రోజైన ఆదివారం నాడు తరగతులు నిర్వహిస్తుండగా తెలుగుదేశం పార్టీ విద్యార్ధి విభాగం టిఎన్ఎస్ఎఫ్ అడ్డుకుంది. నగరంలోని శ్రీ చైతన్య, నారాయణ, వొవెల్, రవీంద్ర భారతి కళాశాలల్లో ప్రత్యేక తరగతుల పేరుతో ఆదివారం విద్యార్ధులకు క్లాసులు నిర్వహిస్తుండగా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు, ప్రధాన కార్యదర్శి అమృల్లా అడ్డుకున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్ధులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఇళ్లకు పంపారు. కొన్ని కళాశాలల్లో అక్కడి సిబ్బంది టిఎన్ఎస్ఎఫ్ నాయకులను అడ్డుకోగా స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో వారు కళాశాల ముందు నినాదాలు చేయడంతో వారు తరగతులను నిలిపివేశారు. ఈ సందర్భంగా తిరుమల నాయుడు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ర్యాంకుల పేరుతో విద్యార్ధులపై మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులకు కనీస ఆట విడుపు, మానసిక విశ్రాంతి కూడా లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే టిఎన్ఎస్ఎఫ్ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమృల్లా, సాయి తేజ, చైతన్య, ఉత్తేజ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!