January 23, 2020

నెల్లూరులో జూదంపై ఉక్కుపాదం – 11 మంది సింగిల్ నంబర్ లాటరీ నిర్వాహకుల అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో చిన్నచిన్న పనులు చేసుకునే వారే టార్గెట్ గా కొనసాగుతున్ సింగిల్ నంబర్ లాటరీపై పోలీసులు దృష్ఠి సారించారు. రూపాయికి 8 రూపాయలు ఇస్తామని నమ్మించి కార్మికుల వద్ద నుండి లాటరీ పేరుతో కొనసాగుతున్న ఈ దోపిడీకి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహించే 11 మందిని బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని బుజబుజనెల్లూరు, వెంకటేశ్వరపురం, గిడ్డంగి వీధి, డైకస్ రోడ్డు, బారకాస్, కుమ్మరివీధి, ఈద్గమిట్ట, కోటమిట్ట, విరాట్ నగర్, మన్సూర్ నగర్, కుక్కల గుంట ప్రాంతాలకు చెందిన షేక్ అన్వర్ బాషా, ఎస్.కే. షబ్బీర్, షేక్ ఇంతియాజ్, జావిద్, జమీర్, పటాన్ అబ్ధుల్ ఆరిఫ్, సాయి రామంజనేయులు, షాహిద్ రసూల్ బాషా, సయ్యద్ ముజాహిద్, షేక్ అబ్ధుల్, కనగంటి శంకర్ అనే నలుగురు ముద్దాయిలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని సింగిల్ లాటరీ జూదం ఆడిస్తుంటారు. ఎక్కువగా ఆటో డ్రైవర్లు, కూలీ పనులు చేసే వారిని ఆకర్షించి ఈ జూదంలోకి దించుతారు. సింగిల్ నంబర్ లాటరీపై నిఘా ఉంచిన చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసన్ బుధవారం ఉదయం తన బృందంతో వెళ్లి 11 మంది నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 47వేల రూపాయల నగదు, మూడు బైక్ లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

దీనిపై నగర డిఎస్పీ జే. శ్రీనివాసుులరెడ్డి దర్గామిట్టలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బైకులు సింగిల్ నంబర్ లాటరీ ద్వారా వచ్చిన నగదుతోనే కొనగోలు చేసినట్లు తమ విచారణలో తేలిందని డిఎస్పీ వెల్లడించారు. నిందితులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నగదు కోసం జూదం ఆడిస్తున్నట్లు చెప్పారు. అనేక మంది బాధితులు సింగిల్ నంబర్ లాటరీ జూదానికి బానిసలుగా మారి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలినట్లు డిఎస్పీ వివరించారు. నిందితుల్లోని షబ్బీర్ పై గతంలో గుడిలో దొంగతనం చేసిన కేసులు, కోడి పందాల నిర్వాహణ కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ తరహా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగిల్ నంబర్ లాటరీ పై దృష్ఠి పెట్టి 11 మంది నిర్వాహకులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన సిఐ శ్రీనివాసన్ ను ఆయన బృందాన్ని డిఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!