November 22, 2019

టిడిపి సీనియర్ నేత బెజవాడ ఓబుల్ రెడ్డి కన్నుమూత – రెండు రోజుల క్రితమే బయటపడ్డ క్యాన్సర్

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ ఓబుల్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 85 సంవత్సరాల వయస్సున్న ఓబుల్ రెడ్డికి, సాధారణంగా వృద్ధాప్యం కారణంగా ఇటీవల అస్వస్థతకు గురైనారు. హాస్పిటల్ లో చికిత్స పొందిన అనంతరం తిరిగి నెల్లూరులోని వారి నివాసానికి చేరుకున్నారు. ఈనెల 14వ తేదీనా నెల్లూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వారి నివాసానికి వెళ్లి ఓబుల్ రెడ్డిని పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో రెండు రోజుల క్రితం అంటే ఆదివారం మరో సారి అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు జయభారత్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా కడుపులో క్యాన్సర్ కణతి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపద్యంలో అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. నెల్లూరుజిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన బెడవాడ ఓబుల్ రెడ్డి మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారు. ఓబుల్ రెడ్డి సోదరులు, మాజీ ఎమ్పీ బెడవాడ పాపిరెడ్డి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. పాపిరెడ్డి మరణం తర్వాత క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన ఓబుల్ రెడ్డి టిడిపి రైతు విభాగంలో పలు పదవులను అధిరోహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటి సభ్యునిగా ఉంటూ ఐదేళ్ల క్రితం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైనారు. రైతు సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ఓబుల్ రెడ్డికి అనేక దఫాలు నామినేటెట్ పదవులు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరో వైపు ఓబుల్ రెడ్డి మృతి పట్ల అధినేత చంద్రబాబుతో పాటూ జిల్లా నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు. నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి ఓబుల్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అంత్యక్రియలు నెల్లూరులో గురువారం ఉదయం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!