January 23, 2020

దిశ కేసుకు ముగింపు పలికిన తెలంగాణా పోలీసులు – నలుగురు నిందితుల ఎన్ కౌంటర్

Clock Of Nellore ( Hydarabad ) – శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత తగులబెట్టిన చాటాన్‌పల్లి వంతెన వద్దే నిందితులు మృతి చెందారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులను ఘటాస్థలికి తీసుకెళ్లిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దిశను తగులబెట్టిన స్థలంలో పోలీసులపై దాడి చేసి.. నిందితులు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు.
 
దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కేసును స్వయంగా పర్యవేక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేలా.. నెల రోజుల్లోనే కేసును కొలిక్కి తెచ్చేలా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం బలమైన ఆధారాల కోసం సోధిస్తున్న క్రమంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం
దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న సమీప ప్రాంతాల ప్రజలు చటాన్‌పల్లి వంతెన వద్దకు  భారీగా తరలి వచ్చారు. దిశ హత్యాచార ఘటన జరిగినప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు తాజా ఘటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ కిరాతకులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో ఆడ పిల్లలపై అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువైనట్లు చెబుతున్నారు. వంతెనపై నుంచి పోలీసులపై పూలు చల్లుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ తెలంగాణ పోలీస్‌ జిందాబాద్‌.. సాహో సజ్జనార్‌’ అంటూ నినదిస్తున్నారు. అంతేకాకుండా డయల్‌ 100 పెద్ద ఎత్తున ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!