November 21, 2019

రైతుల విషయంలో జగన్ మాట తప్పారు… మడం తిప్పారు… సోమిరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) – మాట తప్పం… మడం తిప్పం… అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల విషయంలో మాట తప్పి, మడం తిప్పారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రకటన రాకముందే 2017లో జగన్ రైతులకు 12,500 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ నేడు మాట మార్చి కిసాన్ సమ్మాన్ తో కలిపి అంటున్నారని అంటే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కేవలం 7500 రూపాయలకే పరిమితం చేశారని చెప్పారు. టిడిపి హయాంలో కిసాన్ సమ్మాన్ 6వేలు, అన్నదాత సుఖీభవ కింద 9వేలు కలిపి మొత్తం 15వేలు ఇవ్వాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశామని సోమిరెడ్డి గుర్తు చేశారు. అంతే కాకుండా 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులకు కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 10వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. గత ఏడాదికి సంభందించి పిఎం కిసాన్ సమ్మాన్ 6వేలు, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పారు. అలాగే కౌలు రైతులకు కూడా 15వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒకే సారి రైతు భరోసా అన్నారు… ఇప్పుడేమో విడతల వారీగా అంటున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వం కన్నా మెరుగైన పథకం తెస్తామని చివరకు రైతులను నిరుత్సాహపరిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్నా రుణమాఫీ, అన్నదాత సుఖీభవ కలిపి 17,400 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమచేశామని సోమిరెడ్డి తెలియజేశారు. ఎన్నికల కోడ్ తో సంభందం లేకుండా రైతు రుణమాఫీ నగదు వారి ఖాతాల్లో జమ అయ్యేలా ప్రయత్నం చేయగా వైసీపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి దాన్ని అడ్డుకుందని అన్నారు.

అంతే కాకుండా వైసీపి ప్రభుత్వం ఏర్పడ్డాక రుణమాఫీ బకాయిల చెల్లింపును రద్దు చేశారని… ఇదేనా రైతులకు మీరిచ్చిన బహుమానం అని సోమిరెడ్డి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై కోపంతో రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకాన్ని రైతులందరికీ వర్తింపు జేస్తామని, దానికి 3వేల కోట్లు అవసరమవుతుందని శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ బడ్జెట్ లో మాత్రం కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారని ఇదెక్కడి రైతు ప్రభుత్వమని విమర్శించారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కరువు పరిస్థితుల్లోనూ వృద్ధి రేటు సాంధించామని సోమిరెడ్డి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల పాలనలో మద్యం, ఇసుక ధరలు, కరెంటు కోతలు, దాడులు పెరగగా… వృద్ధి రేటు, పెట్టుబడులు మాత్రం తగ్గిపోయాయని మండిపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు పర్యటన బ్రహ్మాండంగా సాగిందని, ఊహించిన దానికన్నా భారీ స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ఎం జరుగుతుందో ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా సమీక్షించుకోవాలని, పేదల ఆస్తులపైనా, వారిపైనా జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలని సోమిరెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!