November 19, 2019

వైసీపి దాడులను తిప్పికొడతాం… అవసరమైతే కోర్టు కెళ్తాం…. టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడుల్లో నష్టపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పార్టీ తరపున ఆదుకుంటామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆయన నెల్లూరులోని అనీల్ గార్డెన్స్ లో వైసీపి బాధితులతో సమావేశ మయ్యారు. జిల్లా వ్యాప్తంగా వైసీపి దాడులకు గురైన బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకార్ల తిరుమల నాయుడిపై జరిగిన దాడిని అడిగి తెలుసుకుని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపి దాడులకు భయపడవద్దని స్థానిక టిడిపి కేడర్ మీ అండగా నిలుస్తుదని చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ వైసీపి నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నేతలపై అక్రమ కేసులు బనాయించే పోలీసులపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. వైసీపి ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన చంద్రబాబు, బాధితులకు అండగా ఉండి వారి తరపున పోరాటం చేస్తామని చెప్పారు. టిడిపి కార్యకర్తలపైనే కాకుండా జర్నలిస్టులు, అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇది నేరస్తుల ప్రభుత్వమని అభివర్ణించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని… నేను కూడా మీలాగే వ్యవహరించి ఉంటే వైసీపి నేతలు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. దొంగసారా, క్రికెట్ బెట్టింగ్ కాసేవారు ఎమ్మెల్యేలా అని నిలదీశారు. వైసీపి ఎమ్మెల్యేలకు పిచ్చి పట్టిందని … మహిళల జోలికొస్తే తాట తీస్తానని చంద్రబాబు హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!