January 23, 2020

సోషల్ మీడియాతో అన్నీ అనర్ధాలే – జాగ్రత్తగా ఉండాలన్న బివి రమణకుమార్

Clock Of Nellore ( Nellore ) – విద్యార్ధులు సోషల్ మీడియాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలని రాష్ట్ర సమాచార కమీషనర్ బివి రమణకుమార్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో వసంతలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైం ఎస్పీ రామ్మోహన్ కూడా హాజరయ్యారు. వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా బివి రమణకుమార్ విద్యార్ధినులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్ధులు ఫేస్ బుక్, టిక్ టాక్ వంటి వాటికి ఆకర్షణ అవుతున్నారని, భవిష్యత్తును దృష్ఠిలో ఉంచుకుని వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇంటర్నెట్, గూగుల్ ను తెలివితేటలను పెంచుకోవాలే గానీ వాటితో సైబర్ నేరాలకు పాల్పడకూడదని చెప్పారు. సైబర్ నేరాలతో భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. సైబర్ సెక్యూరిటీ టిప్స్ ఫర్ ఉమెన్, అవేర్ నెస్ క్యాంపైన్ ఎగెనెస్ట్ సైబర్ క్రైమ్స్, సైబర్ సెక్యూరిటీ టిప్స్ ఫర్ చిల్డ్రన్స్ అనే పుస్తకాలను తయారు చేసి విద్యార్ధులకు అందిస్తున్నామని రమణకుమార్ వెల్లడించారు. సైబర్ క్రైం ఎస్పీ రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లలకు నేరం గురించి చెప్పడమే ఒక తప్పు అని మంచి చెప్పాల్సిన ఈ కాలంలో నేరాల గురించి చెప్పవలసి రావడానికి కారణం పెరుగుతున్న టెక్నాలజీయేనని వివరించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు టెక్నాలజీపై అవగాహన లేకే సైబర్ నేరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వసంతలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మైన్ వసంత లక్ష్మి, సుప్రీంకోర్టు న్యాయవాది సందీప్ దుబే, తెలంగాణా హైకోర్టు న్యాయవాది మమత రాణి, మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైబర్ క్రైం ఎక్స్ పర్ట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!