November 19, 2019

నెరవేరిన సోమశిల 33 ఏళ్ల కల – 78 TMCల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన జలాశయం

Clock Of Nellore ( Somasila ) – నెల్లూరుజిల్లాలోని సోమశిల జలాశయం చరిత్రను లిఖించింది. జలాశయం చరిత్రలోని 33 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. బుధవారం సమగ్ర సోమశిలగా రికార్డు సృష్ఠించింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జలాశయాన్ని జాతికి అంకితం చేసిన దగ్గర నుండి నిన్నటి వరకూ ఈ 33 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయి 78 TMCల నీటి మట్టానికి జలాశయం చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం 78 TMCలకు నీటి మట్టం చేరుకోగా జలవనరుల శాఖ అధికారులు దాన్ని అధికారికంగా నమోదు చేశారు. మరో వైపు కండలేరుకు నీరు విడుదల నిరంతరాయంగా కొనసాగుతుంది. అది కాకుండా సోమశిల ఉత్తర, దక్షిణ కాలువల గుండా కూడా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. జలాశయం 78TMCలకు చేరినా కూడా ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో జలాశయంకు సంభందించిన 6, 7 గేట్లను మధ్యాహ్నం 3గంటల సమయంలో ఎత్తి నీటిని పెన్నానదిలోకి విడుదల చేస్తున్నారు. సమగ్ర సోమశిల కల సాకారం కావడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమశిల చరిత్రలో ఇప్పటి వరకూ లేని విధంగా పూర్తి స్థాయి సామర్ధ్యంతో నీరును జలాశయంలో నిల్వ చేయడంతో ప్రభుత్వం కూడా సంతోషం వ్యక్తం చేసింది. ప్రధానంగా జిల్లాకు చెందిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ తన ఆనందాన్ని సహచర మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్పీలతో పంచుకున్నారు. జలాశయంలో 78 TMCలు నీటిని నిల్వ ఉంచే విధంగా ఇన్ ఫ్లో ఎంత వస్తుందో అంతే మొత్తం అవుట్ ఫ్లో ఉండే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ జలాశయాన్ని సందర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!