November 19, 2019

సంగం పొర్లుకట్టకు వరద కోత – ఆందోళనలో స్థానికులు

Clock Of Nellore ( Sangam ) – నెల్లూరుజిల్లాలోని సంగం ఆనకట్ట వద్ద ఏర్పాటు చేసిన పొర్లుకట్ట కోతకు గురౌతుంది. సోమశిల నుండి పెన్నానదికి నీరు విడుదల చేస్తుండటంతో ఆ నీటి ఉధృతికి పొర్లుకట్ట భారీగా దెబ్బతింటుంది. సంగం బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఆనకట్టకు దిగువ భాగంలో ఎడమ వైపు అధికారులు పొర్లుకట్టను ఏర్పాటు చేశారు. సంగం ఆనకట్ట ఎడమ వైపు తూముల నుంచి వరద ప్రవాహం వెళ్లే మార్గాన్ని ఈ పొర్లుకట్ట ద్వారా కొద్ది నెలల క్రితం మళ్లించారు. ఇందులో భాగంగా సంగం ఎస్సీ కాలనీ సమీపంలో ఎడమవైపు పొర్లుకట్టకు దగ్గరగా ప్రత్యేకంగా కాలువను ఏర్పాటు చేశారు. దీనిలో సాధారణ నీటి ప్రవాహం మాత్రమే వెళ్లేది. ఇదే తరుణంలో వరద నీరు అధికంగా రావడంతో శనివారం నుండి పొర్లుకట్ట కోతకు గురౌతుంది. స్థానిక ఎస్సీ కాలనీ వాసులు ఏ క్షణాన ఏమవుతుందోనని భయపడుతున్నారు. పొర్లుకట్ట పూర్తిగా కోతగు గురైతే తమ ఇళ్లతో పాటూ పొలాలు ముంపునకు గురౌతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు విషయం తెలుసుకున్న తెలుగుగంగ ఎస్ఈ హరినారాయణరెడ్డి కోతకు గురైన పొర్లుకట్టలను పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని సంగం ఎస్సీ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!