November 19, 2019

నెల్లూరులో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం – స్థూపం వద్ద నివాళి అర్పించిన జేసీ

Clock Of Nellore ( Nellore ) – దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలర్పించిన మిలటరీ జవానులు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనతో పాటూ శిక్షణా కలెక్టర్ కల్పనా కుమారి, అదనపు ఎస్పీ మనోహర్ రావు హాజరయ్యి అమరవీరుల స్ధూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్ర వాదం, మత తత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛినకర శక్తులతో, ఘోరాలకు పాల్పడే అసాంఘీక శక్తులతో పోరాడుతూ పోలీసులు అమరులవుతున్నారని అన్నారు. వారి త్యాగనిరతి, స్ఫూర్తి దాయక విధి నిర్వహణ పోలీసు శాఖలో పనిచేస్తున్న అందరికీ ఉత్తేజాన్నివ్వాలని అన్నారు. వారు భౌతికంగా మృతి చెందినప్పటికీ అందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని జాయింట్ కలెక్టర్ గుర్తు చేశారు. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని, విధినిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా వాటన్నింటిని ఓర్చుకుని ప్రతీ ఒక్కరూ మెచ్చుకునేలా వ్యవహరిస్తూ ముందడుగు వేయాలని పోలీసులకు సూచించారు.

క్రైం విభాగం అదనపు ఎస్పీ మనోహర్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగ9ా శాంతి భద్రతల పరిరక్షణలో 292 మంది పోలీసులు అమరులయ్యారని చెబుతూ రెండు నిముషాలు మౌనం పాటించారు. జిల్లాలో అశువులు బాసిన రాపూరు కానిస్టేబుల్ ఆదిశేషయ్య సతీమణి పెంచలమ్మకు, దుగరాజపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్యామ్ సుందర్ సతీమణి కస్తూరి రాణికి జాయింట్ కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. అలాగే పోలీస్ అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన, కార్టూన్ పోటీల్లో విజేతలైన వారికి జేసీతో పాటూ ట్రైనీ కలెక్టర్, అదనపు ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం పోలీసుల ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అడ్మిన్ లక్ష్మీ నారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కోటారెడ్డి, నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ మల్లిఖార్జున రావు, ఏఆర్ డిఎస్పీ రవీంద్ర రెడ్డి, సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, పోలీసు శాఖ సిబ్బంది, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!