October 19, 2019

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా న్యూరో హైఫ్లో బైపాస్ సర్జరీ – ఏపిలో ఇదే మొదటి సారి

Clock Of Nellore ( Nellore ) – వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న నూతన విధానాలను అనుసరిస్తూ ఆధునిక వైద్యంతో విశేష సేవలందిస్తున్న నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఎక్కడా జరగని హై రిస్క్ న్యూరో బైపాస్ సర్జరీని హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ వి.కే. ఆనంద్ వారి బృందం విజయవంతంగా నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో న్యూరో సర్జన్ గా సేవలందిస్తూ కొద్ది కాలం క్రితం నెల్లూరు అపోలో హాస్పిటల్ కు వచ్చిన డాక్టర్ వికే ఆనంద్ అతి క్లిష్టమైన కేసులను సవాలుగా తీసుకుని వాటిని విజయవంతం చేయడంలో పేరు పొందారు. వివరాల్లో కెళ్తే…. 60 ఏళ్ల చిన్నమ్మ అనే మహిళ తీవ్రమైన తలనొప్పితో ఈ ఏడాది జనవరి నెలలో అపోలో హాస్పిటల్ కు వచ్చారు. దీంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడుకు రక్తం సరఫరా అయ్యే రక్త నాళంలో వాపు ( RIGHT ICA GAINT COMPLEX ANEURYSM ) ఉందని గుర్తించారు. హాస్పిటల్ వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని రోగికి చెప్పారు. అయితే వారు రెండవ అభిప్రాయం కోసం మరి కొన్ని హాస్పిటల్స్ ను సంప్రదించి సాధారణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం రోగికి ఎలాంటి ఉపశమనం లభించకపోగా క్రితం ఉన్నటు వంటి తీవ్ర తలనొప్పికి తోడు వాంతులు, మరియు కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారు మళ్లీ ఆగస్టు నెలలో అపోలో హాస్పిటల్ ను సంప్రదించారు. విషయం మొత్తం వారి ద్వారా తెలుసుకున్న హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వి.కే. ఆనంద్ రోగికి సీటి స్కాన్, యాంజియోగ్రామ్ ( IADSA ) పరీక్షలు చేసి ఇంతకు ముందున్న దానికంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, వెంటనే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దీనికి రోగి అంగీకరించడంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకూ ఎక్కడా జరగని న్యూరో హైఫ్లో బైపాస్ సర్జరీ ( RIGHT M2 MCA-RA-ECA CERVICAL SEGMENT ) ని డాక్టర్ వికే ఆనంద్ వారి బృందం విజయవంతంగా నిర్వహించారు.

అత్యంత క్లిష్టమైన ఈ న్యూరో హైఫ్లో బైపాస్ సర్జరీని హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వికే ఆనంద్ ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ డాక్టర్ యశ్వంత్, కార్డియోతొరాసిక్ సర్జన్ డాక్టర్ నాగరాజు మరియు అనస్థీషియన్ డాక్టర్ వంశీరెడ్డి విజయవంతంగా చేపట్టారు. రోగి మెదడుకు రక్తం తీసుకెళ్లే రక్తనాళానికి ఏర్పడ్డ వాపును సాధారణ పద్దతిలో( CLIPPING ) తగ్గించడం అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. అయితే అపోలో వైద్యులు దానికి ప్రత్యామ్నాయ పద్దతిలో రక్త నాళంలోని వాపు ఉన్న భాగాన్ని తొలగించి దాని స్థానంలో చేతి నుండి సేకరించిన రక్తనాళాన్ని అమర్చి కుట్లు వేశారు. శస్త్ర చికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకుని సాధారణ జీవనానికి రావడమే గాక డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సందర్బంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటి హాస్పిటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శస్త్ర చికిత్స వివరాలను సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వికే ఆనంద్ వారి బృందం వివరించింది. ఈ సమావేశంలో డాక్టర్ యశ్వంత్, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్, యూనిట్ హెడ్ నవీన్, కార్డియోతొరాసిక్ సర్జన్ డాక్టర్ నాగరాజు మరియు అనస్థీషియన్ డాక్టర్ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!