November 16, 2019

ఇరిగేషన్ పనుల్లో 19 కోట్ల అవినీతి – మంత్రి అనీల్ ను ప్రశ్నించిన టిడిపి నేత ఏవిఆర్

Clock Of Nellore ( Nellore ) – 19 కోట్ల రూపాయల అంచనాలతో నెల్లూరుజిల్లాలో కాలువల మరమ్మత్తు పనులకు పిలిచిన టెండర్లలో పూర్తిగా అవినీతి చోటుచేసుకుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. దీనిపై జిల్లా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసిందని ఫిర్యాదు ప్రతిని చూపించారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం వెంకట రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఇరిగేషన్ పనులకు సంభందించి అనేక మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారని చెప్పారు. ఎక్కువ మంది అంచనాల కంటే తక్కువ కోట్ చేశారని, ఇద్దరు ముగ్గురు మాత్రం ఎక్కువ కోట్ చేశారని చెప్పారు. అయితే అధికారులు ఎక్కువ కోట్ చేసిన వారికే పనులు అప్పగించారని చెప్పారు. సాధారణంగా టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అగ్రిమెంటుకు 10 నుండి 15 రోజుల సమయం ఇస్తారని కానీ ఈ పనుల్లో మాత్రం కేవలం 3 రోజులు సమయమిచ్చి లేఖలు కాంట్రాక్టర్లకు పంపి అవి వారికి చేరేలోగానే ఎవ్వరూ రాలేదన్న సాకుతో ఎక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ఆరోపించారు. దీని వెనుక నెల్లూరుకు చెందిన ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రమేయముందని చెప్పారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కార్యాలయమైన రాజీవ్ భవన్ నుండి సిఫార్సు చేసిన వారికే అధికారులు పనులు అప్పగించారని విమర్శించారు. సొంత జిల్లాలో ఇంత దోపిడీ జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్లు అధికారులను ప్రశ్నించినా ఫలితం లేదన్నారు. ఇక చేసేది లేక వారు ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసారని లేఖ ప్రతిని విలేకరులకు చూపించారు. సంభందిత మంత్రి అనీల్ కుమార్ కు లేఖ రాయకుండా… ముఖ్యమంత్రికే లేఖ రాశారంటే ఏ విధంగా కాంట్రాక్టర్లు భయాందోళనలో ఉన్నారో అర్ధం చేసుకోవాలని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తున్నాం అని చెప్పే మంత్రి అనీల్ దీనిపై సమాధానం చెప్పాలని రమణారెడ్డి డిమాండ్ చేశారు. అంతే కాకుండా రైతులచే కాలువ పనులు చేయించే ఉద్దేశ్యంతో క్యూబిక్ మీటర్ కు 210 రూపాయలు కేటాయించారని అయితే కాంట్రాక్టర్లు మాత్రం జేసీబిలతో పనులు చేయిస్తున్నారని చెప్పారు. జేసీబిలతో పనులు చేయిస్తే క్యూబిక్ మీటర్ కు కేవలం 45 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. యంత్రాలతో 19కోట్ల పనులను కేవలం 4కోట్లకే పూర్తి చేయవచ్చునని దీని ప్రకారం ఈ పనుల్లో 15 కోట్ల రూపాయలు అవినీతి చోటు చేసుకుందని రమణారెడ్డి ఆరోపించారు. వర్షాలతో అన్నీ కాలువల్లో నీరు ప్రవహిస్తున్నాయని, ఈ నీటి ప్రవాహానికి కాలువల్లోని బురద, గుర్రపుడెక్క కొట్టుకుపోతుందన్నారు. నీటి ప్రవాహానికి అవన్నీ కొట్టుకుపోతే ఇక కాంట్రాక్టర్లు చేసేది ఏముందని అంటూ ఎలాంటి పనులు చేయకుండానే పనులు చేసినట్లు 19 కోట్ల రూపాయలు దిగమింగేందుకు సిద్దమయ్యారని వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈ అవినీతిలో జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలకు వాటా ఉందన్నారు. తక్షణం మంత్రి అనీల్ కుమార్ యాదవ్ స్పందించి టెండర్లను రద్దు చేసి వరదలు తగ్గిన తర్వాత మళ్లీ పారదర్శకంగా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!