November 19, 2019

ఇరిగేషన్ టెండర్లలో పారదర్శకత ఎక్కడ – మంత్రి అనీల్ ను ప్రశ్నించిన ఆనం వెంకటరమణారెడ్డి

Clock Of Nellore ( Nellore ) – పారదర్శకత పేరుతో రివర్స్ టెండరింగ్ కు వెళ్తూ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తన సొంత జిల్లా అయిన నెల్లూరులో మాత్రం పారదర్శకత పేరుతో అవినీతికి తెరలేపారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. నీరు – చెట్టు కార్యక్రమం అంతా అవినీతే అని గతంలో దుయ్యబట్టిన వైసిపీ అదే కార్యక్రమం చేపడుతూ అవినీతికి పాల్పడటం లేదా అని ప్రశ్నించారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ కాలువల నిర్వహణ, పూడిక తీత తదితర పనుల కోసం ఇటీవల నిర్వహించిన టెండర్లలో పూర్తిగా అవినీతి జరిగిందని ఆరోపించారు. గతంలో ఉన్న అంచనాల కంటే భారీగా అంచనాలు పెంచి అధికారులు టెండర్లు పిలిచారని చెప్పారు. ఒక్కో పనికి ఒక్కొక్కరే టెండర్లు వేశారని అది కూడా ఎక్కువ కోడ్ చేసి వేయగా వాటిని అధికారులు ఆమోదించారన్నారు. అన్నీ పనులకు కలిసి మొత్తం 10 కోట్ల రూపాయల పై వరకే ఎక్కుడ కోడ్ చేశారని టెండర్ల కాగితాలను చూపించారు. ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కనుసన్నల్లో జరిగిన ఈ టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకుండా అన్నీ టెండర్లు ఒకే ఒక్క వ్యక్తికి అప్పగించారన్నారు. అంతర్జాతీయ స్థాయి కాంట్రాక్టర్లు ఉన్న నెల్లూరులో ఒక్కో పనికి ఒక్కో టెండరే దాఖలవడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. పనుల కోసం వచ్చే కాంట్రాక్టర్లను వైసీపి ప్రజాప్రతినిధులు బెదిరించారని వారికి అనుకూలమైన వారికి అధిక రేట్లకు టెండర్లు ఇప్పించారని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. తక్షణం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేయాలని ఏవిఆర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!