January 23, 2020

ప్రాణమున్నంత వరకూ టిడిపిలోనే ఉంటా – స్పష్టం చేసిన బీదా రవిచంద్ర

Clock Of Nellore ( Nellore ) – అవసరమైతే రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాను కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని శాసనమండలి సభ్యులు మరియు నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రవిచంద్ర సోదరులు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపిలో చేరిన విషయం తెలిసిందే. తన సోదరుణ్ని కూడా వైసీపిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మస్తాన్ రావు విలేకరులతో అన్నారు. మస్తాన్ రావు వ్యాఖ్యలతో రవిచంద్ర కూడా అన్న బాటలోనే పయనిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ రాజకీయ చర్చలకు తెరదించే విధంగా బీదా రవిచంద్ర సోమవారం నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన సోదరుణ్ని టిడిపిలోనే కొనసాగే విధంగా ఒత్తిడి తీసుకొచ్చామని అయితే ఆయన వైసీపిలో చేరాలని నిర్ణయించుకున్నారని అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. తాను మాత్రం టిడిపిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను గానీ పార్టీ మాత్రం మారబోనని వెల్లడించారు. తమ కుటుంబానికి మొదటి నుండి పార్టీలో సముచిత స్థానం ఉందన్నారు. మస్తాన్ రావు పార్టీ మారడం కొంత మేర నష్టమే అయినప్పటికీ తాను భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని గుర్తు చేశారు. తమకు 8 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయని రవిచంద్ర చెప్పారు. ఆస్తులు కాపాడుకునేందుకే మస్తాన్ రావు పార్టీ మారారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!