November 22, 2019

బార్లకు దోచిపెట్టడానికేనా ఈ నిర్ణయం – టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం విధానం లోప భూయిష్టంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం షాపులను రాత్రి 8 గంటలకు మూసివేస్తూ నిర్ణయం తీసుకుని బార్లకు మాత్రం అర్ధరాత్రి వరకూ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సాధారణంగా రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకూ మాత్రమే మద్యం విక్రయాలు అధికంగా జరుగుతుంటాయని గుర్తు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయడం ద్వారా బార్లకు దోచిపెట్టడమేనని అన్నారు. బార్లను కూడా రాత్రి 8 గంటలకు మూసివేయాలన్నారు. మద్యాన్ని ప్రజలకు ఇంకా దూరం చేయాలంటే సాయంత్రం 6 గంటలకే షాపులు, బార్లను మూసివేయాలన్నారు. నూతన మద్యం విధానం బార్లకు మేలు చేకూరేలా ఉందని, పేదవారు బార్లకు వెళ్లి ఆర్ధికంగా ఇంకా దిగజారిపోతారని వెంకట రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో లిక్కర్ పై ఆదాయం భారీగా పెంచి, దశల వారీ మద్య నిషేదం ఎలా చేస్తారని ప్రశ్నించారు. చాలా మంది వైసీపి నేతలు బార్ల యాజమాన్యాలను బెదిరించి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వైసీపి నేతలు చీప్ లిక్కర్ ను రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం షాపులతో పాటూ బార్లను కూడా ఒకే సమయంలో మూసివేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆందోళన కారణంగానే ఇసుక పాలసీలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!