November 19, 2019

ఎమ్పీడిఓ కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ – బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటూ మరి కొందరు తన ఇంటికొచ్చి దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎమ్పీడిఓ సరళ నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటూ, వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నేపద్యంలో శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో ఉన్న కోటంరెడ్డి నివాసం ఉండే అపార్ట్ మెంట్ కు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందం చేరుకుంది. దీన్ని గుర్తించిన కోటంరెడ్డి కుమార్తె నిద్రిస్తున్నాడని పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు అక్కడే వేచిచూశారు. సరిగ్గా ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు డిఎస్పీ రాఘవరెడ్డితో పాటూ పోలీసు బృందం కోటంరెడ్డి నివాసంలోకి వెళ్లి ఎమ్పీడిఓ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్రెష్ అప్ అయి 4 గంటల తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డి వారితో వెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు అప్పటికే అపార్ట్ మెంటు వద్దకు చేరుకున్నారు. కోటంరెడ్డిని తీసుకెళ్తున్న పోలీస్ కారుకు అడ్డుపడ్డారు. దీంతో కోటంరెడ్డి వారికి స్వయంగా అడ్డంకి కలిగించరాదని చెప్పారు. పోలీసులు ఆయన్ను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ కేసులో రెండవ ముద్దాయి అయిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అప్పటికే స్టేషన్ కు వచ్చి ఉన్నారు. అనంతరం వారిని స్టేషన్ నుండి న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు ప్రవేశపెట్టారు. కోటంరెడ్డి తరపు న్యాయవాదులు అప్పటికప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డిని విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైన ఈ అరెస్టు ప్రక్రియ ఆదివారం ఉదయం 11 గంటలతో ముగిసి… బెయిల్ మంజూరైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!