November 22, 2019

జిల్లా ఎస్పీపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి – పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తనపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందూ ఎన్నికల తర్వాత అదే తీరును ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఎమ్పీడిఓ సరళ తనపై పెట్టిన కేసు విషయంలో తప్పు ఉందని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని అన్నారు. ఎమ్పీడిఓ నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రాధమిక విచారణ కూడా జరపకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు సందర్భంలో కూడా పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నారు. తనకు ఒక్క ఫోన్ చేస్తే స్వచ్ఛంధంగా తానే వచ్చి స్టేషన్ లో లొంగిపోయేవాడినని కానీ అలా కాకుండా పోలీసు బలగాలను తన ఇంటికి పంపారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో వెళ్లి వారి కుటుంబసభ్యుల పట్ల దారుణంగా ప్రవర్తించారని కోటంరెడ్డి మండిపడ్డారు. తన పట్ల, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి నేతల పట్ల ఎస్పీ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని దీనిపై తాను 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబుకు ఫిర్యాదు చేయగా తాను మాట్లాడుతానని చెప్పారని కోటంరెడ్డి వివరించారు. ఎస్పీ తీరుపై ముఖ్యమంత్రి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!