November 19, 2019

అల్లీపురం అభివృద్ధికి అంచనాలు తయారు చేయండి – అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) – తెలుగుదేశం పార్టీ కంచుకోట, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వగ్రామం అల్లీపురంలో వైసీపి జెండాను రెపరెపలాడించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. సోమిరెడ్డి ప్రధాన అనుచరుడు కోడూరు కమలాకర్ రెడ్డిని ఇప్పటికే వైసీపిలోకి తీసుకొచ్చిన కోటంరెడ్డి… అల్లీపురం గ్రామంలోని టిడిపి ద్వితీయ శ్రేణి నేతలను కూడా వైసీపిలో కలుపుకున్నారు. ఇక గ్రామ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో గురువారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అల్లీపురంలో పర్యటించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను వెంటబెట్టుకుని వెళ్లిన కోటంరెడ్డి వీధివీధి తిరుగుతూ మహిళలను అడిగి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అతి త్వరలోనే గ్రామంలోని అన్నీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్మశాన వాటిక సమస్య ఉందని ప్రజలు చెప్పగా… చరిత్రలో నిలిచిపోయే విధంగా అందమైన, సుందరమైన అన్నీ వసతులతో స్మశాన వాటికను అభివృద్ధి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. అల్లీపురం గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అక్కడే ఉన్న అధికారులను కోటంరెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!