November 21, 2019

నెల్లూరు ఇసుక నెల్లూరు వాళ్లకే – అధికారుల తీరు మారకపోతే ఆందోళనే – స్పష్టం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఇసుక మాఫియాకు అడ్డుకుట్ట వేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక పాలసీని తీసుకువస్తే కొందరు అధికారుల తీరు కారణంగా అది పక్కదోవ పడుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు వాసులు ఇసుక కోసం ఆన్ లైన్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తే నో స్టాక్ అని చూపిస్తుందని అదే తరుణంలో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలకు మాత్రం ఇసుక తరలివెళ్తుందని ఈ సందర్భంగా కోటంరెడ్డి గుర్తు చేశారు. నెల్లూరులోని వారి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇసుక విషయంలో రాజకీయ జోక్యం ఉండదని గతంలో జిల్లా కలెక్టర్ కు స్పష్టంగా చెప్పామని అయినప్పటికీ బయట ప్రాంతాలకు ఇసుక తరలివెళ్తుందని వెల్లడించారు. దీని కారణంగా నెల్లూరు నగరంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిపై తానూ, మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఇకపై పొట్టేపాళెం ఇసుక రీచ్ నుండి కేవలం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ప్రజలకే ఇసుకను ఇవ్వనున్నారని దీనిపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. కేవలం ట్రాక్టర్లకే ఇసుకను లోడ్ చేయనున్నారని, లారీలు, టిప్పర్లకు అనుమతి లేదన్నారు. నూతన ఉత్తర్వులు అధికారులు పక్కాగా అమలు చేసి నెల్లూరు సిటీ, రూరల్ ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని లేదంటే తానే ప్రత్యక్ష పోరాటానికి సిద్దపడతానని స్పష్టం చేశారు. పొట్టే పాళెం రీచ్ నుండి బయట ప్రాంతాలకు ఇసుకను తరలించకుండా ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!