November 16, 2019

శభాష్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… కార్పొరేట్ విద్యా మాఫియాపై యుద్ధం ప్రకటన…

Clock Of Nellore ( Nellore ) – ప్రతిపక్షంలో ఉండే ప్రజా ప్రతినిధులు సమస్యలపై ప్రజా పోరాటాలు చేయడం పరిపాటి. అయితే అందుకు భిన్నం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్షమైనా… అధికార పక్షమైనా… ఆయనది మాత్రం… ప్రజా పక్షమే… ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యం… నిబంధనల ఉల్లంఘనను సాకుగా చూపి కార్పొరేట్ విద్యాసంస్థల నుండి కోట్ల కోట్లు దండుకునే రాజకీయ నాయకులున్న నేటి రోజుల్లో… ప్రజలు నాకు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించుకుని … కార్పొరేట్ శక్తులకు ఎదురొడ్డాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు కేంద్రంగా సాగుతున్న కార్పొరేట్ విద్యా మాఫియాపై యుద్ధం ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆయన నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రాంతంలో ఉన్న నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలను సందర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, రీజనల్ ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్న కోటంరెడ్డి ఆయా కళాశాలలు నిబంధనలకు లోబడి నడుస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. అధికారులు చెప్పిన మాటకు ఎమ్మెల్యే ఖంగు తిన్నారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన ఉన్నాయని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 15 రోజుల్లోగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేట్ విద్యా సంస్థల వివరాలు అవి నిబంధనలకు లోబడి నడుస్తున్నాయా లేదా అనే వివరాలు అందివ్వాలని కోరారు. నిబంధనలు ఎవ్వరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తనకు తెలియజేయాలని అందుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్ ఫీజు 3500 రూపాయలు అయితే నారాయణ, శ్రీ చైతన్య యాజమాన్యాలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీని వల్ల మధ్య తరగతి ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడికి అడ్డుకట్ట వేసేందుకు చేపట్టే ఉద్యమానికి తొలి అడుగు వేశానని ఇంతటితో ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కార్పొరేట్ విద్య పేరుతో మధ్య తరగతి ప్రజల నుండి లక్షలకు లక్షలు గుంజుతుంటే తాను చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ వారి తలలు వంచుతానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!