November 21, 2019

నిలకడగా ట్రాఫిక్ ఎస్సై కృష్ణ ఆరోగ్య పరిస్థితి – ట్రక్ డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు

Clock Of Nellore ( Nellore ) – విధుల్లో ఓ ట్రాఫిక్ ఎస్సైను ట్రక్ ఢీ కొట్టి వెళ్లిపోయిన సంఘటన ఆదివారం రాత్రి నెల్లూరులో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు సౌత్ ట్రాఫిక్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న కృష్ణ ఆదివారం రాత్రి బొల్లినేని హాస్పిటల్ వద్ద విధుల్లో ఉన్నారు. వాహనదారులను ఆపి డ్రంక్ అండ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టాటా ఏస్ వాహనం వేగంగా రావడాన్ని గుర్తించి ఎస్సై ఆ వాహనాన్ని ఆపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో పరీక్ష చేసేందుకు ఎస్సై కృష్ణ యంత్రం తీస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు. వాహనాన్ని ఆపేందుకు ఎస్సై దాని డోర్ పట్టుకున్నా డ్రైవర్ మాత్రం అవేమి పట్టించుకోకుండా వాహనాన్ని వేగంగా నడిపి డివైడర్ కు ఢీ కొట్టి తర్వాత అప్పటికప్పుడే అదే వాహనం ద్వారా పరారయ్యాడు. అదే క్రమంలో ఎస్సై కృష్ణ వాహన డోర్ ను వదలకపోవడంతో డివైడర్ పై పడి తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయం తగిలింది. మోకాలు విరిగింది. దీంతో సిబ్బంది గాయపడ్డ కృష్ణను పక్కనే ఉన్న బొల్లినేని హాస్పిటల్ కు తరలించారు. రాత్రి వరకూ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ సోమవారం మధ్యాహ్నంకు ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడిందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు సహచర సిబ్బంది చెప్పారు. మరో వైపు ఈ ఘటనకు కారణమైన టాటా ఏస్ వాహనం, దాని డ్రైవర్ వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సిసి టివి కెమరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బొల్లినేని వైద్యశాల వద్ద ఉన్న కెమరాల ఫుటేజీ అంత స్పష్టంగా లేన్నట్లు సమాచారం. దీంతో మిగిలిన కెమరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఎస్సై కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!