November 21, 2019

ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు – 2లక్షల విలువైన దుంగలు స్వాధీనం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా… అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ విలువైన ఎర్ర చందనంను రాష్ట్రాలు దాటిస్తున్నారు స్మగ్లర్లు. దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికంగా కొందరు సహకారం అందిస్తుండటంతో ఎర్ర చందనం అక్రమ రవాణా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి స్మగ్లర్లను అరెస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూరు – రాజంపేట రోడ్డులో పోతుపడ్డ వాగు వంతెన వద్ద కారులో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా సమాచారం అందుకున్న రాపూరు పోలీసులు కారును, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కారును పరిశీలించగా అందులో 2 లక్షల రూపాయల విలువైన ఎర్ర చందనంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాపూరు పోలీస్ స్టేషన్ లో వెంకటగిరి సిఐ అన్వర్ బాషా శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఎర్ర చందనంతో పాటూ కారును స్వాధీనం చేసుకున్నామని నిందితులైన ముగ్గుర్ని అరెస్టు చేశామని మరో ఇద్దర్ని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన కేతరాజుపల్లి నారాయణ, జల్లి హరికృష్ణ, నెల్లూరుజిల్లాలోని పెళ్లకూరు మండలం, చింతపూడి గ్రామానికి చెందిన తమ్మినేని బాబు అనే వారిని అరెస్టు చేసినట్లు, కడపకు చెందిన జల్లి నరసింహులు, తిరుపతికి చెందిన సుబ్బారెడ్డిని అరెస్టు చేయాల్సి ఉందని సిఐ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాపూరు ఎస్సై కోటిరెడ్డి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!