November 12, 2019

చేపల సాగుకు కుళ్లిన చికెన్ వ్యర్ధాలు – 15 మందిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Buchi & Sangam ) – నెల్లూరు హోటళ్లలో కుళ్లిన మాంసం, చికెన్ తో ఆహార పదార్ధాలు తయారు చేస్తూ ప్రజలకు వడ్డిస్తున్న తరుణంలో అధికారులు దాడులు నిర్వహించి పచ్చి నిజాలు బయటపెట్టిన కొద్ది రోజులకే నెల్లూరు పోలీసులు మరో నమ్మలేని నిజాన్ని బయటకు తీశారు. నిల్వ ఉంచిన మాంసం, చికెన్ లతో భయపడుతున్న జనం చేపలు, రొయ్యల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే తరుణంలో వాటి పెంపకంలో కూడా కుళ్లిన మాంసం, చికెన్ వాడుతున్నారని పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు. జిల్లాలో చేపల సాగు చేసే అనేక మంది వాటికి మేతగా కుళ్లిపోయిన చికెన్ ను, ఇతర జీవ వ్యర్ధాలను ఉపయోగిస్తున్నారు. వారి కోసం దళారులు చెన్నై, చిత్తూరు, కడప జిల్లాల నుండి వేల కిలోల చికెన్ ను, జీవ వ్యర్ధాలను జిల్లాకు తీసుకొస్తున్నారు. వాటిని చేపల సాగు దారులకు విక్రయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎస్పీ ఆదేశాలతో సోమవారం రంగంలోకి దిగిన నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి, బుచ్చి సిఐ సురేష్ బాబు, బుచ్చి ఎస్సై బలరామిరెడ్డి, సంగం ఎస్సై శ్రీకాంత్ లు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులే ఆశ్చర్యపడేంతగా కుళ్లిన చికెన్, జీవ వ్యర్ధాలు బయటపడ్డాయి. బుచ్చి, సంగం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో 12వేల కిలోల కుళ్లిన చికెన్, ఇతర జీవ వ్యర్ధాలను గుర్తించారు. మొత్తం 80 బ్యారెల్స్ ను 8 వాహనాల్లో వాటిని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. 15వేల కిలోల వ్యర్ధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ బ్యారెల్స్ ను ఫిషరీస్ అధికారులకు అప్పగించారు. ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యర్ధ పదార్ధాలతో పెరిగే చేపలను తింటే కిడ్నీ, మోకాళ్ల సమస్యలు, మహిళలకు గర్భకోశ వ్యాధులు కలుగుతాయని పోలీసులు తెలిపారు. కుళ్లిపోయిన కోళ్లు, జీవ వ్యర్ధ పదార్ధాలు అమ్మినా, కొనుగోలు చేసినా, చేపల సాగుకు ఉపయోగించినా, వాటి రవాణాకు సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అరెస్టయిన ముద్దాయిల వివరాలు

1. ఇజ్జగిరి ప్రేమ్ – గాదెలదిన్నె గ్రామం, విడవలూరు మండలం
2. కత్తి వెంకయ్య – దామర మడుగు, బుచ్చి మండలం
3. ఉగోటి పెంచలయ్య – దామరమడుగు – బుచ్చి మండలం
4. ఉప్పల వెంకటేశ్వర్లు – నార్త్ రాజుపాళెం – కొడవలూరు మండలం
5. పాలకీర్తి వెంకటేశ్వర్లు – నార్త్ రాజుపాళెం – కొడవలూరు మండలం
6. శెట్టి ప్రకాష్ – గాంధీజన సంగం – సంగం మండలం
7. బొట్టు నాగేంద్ర – వావిళ్ల – విడవలూరు మండలం
8. నిమ్మల ప్రసాద్ – రామతీర్ధం – విడవలూరు మండలం
9. రాపూరు శ్రీను – వావిళ్ల – విడవలూరు మండలం
10. పాలకీర్తి బ్రహ్మయ్య – వావిళ్ల – విడవలూరు మండలం
11. దేవరకొండ సైదులు – గుడ్లూరు – ప్రకాశం జిల్లా
12. కామంచి వెంకటరావు – గుడ్లూరు – ప్రకాశం జిల్లా
13. మల్లి శ్రీనివాసులు – ఉలవపాళ్ల – దగదర్తి మండలం
14. గోళ్ల పరమేష్ – ఉలవపాళ్ల – దగదర్తి మండలం
15. బల్లి సోమరాజు – దువ్వూరు – సంగం మండలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!