November 19, 2019

బావ… బావమరిది మధ్య ఆధిపత్య పోరు – ఎంపిడిఓ కేసు దాని ఫలితమే ?

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు భగ్గుమంది. అది కూడా సొంత బంధువుల మధ్యే కావడం గమనార్హం. బావ వరుస అయ్యే వైసిపి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, బావ మరిది వరుస అయ్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య పోరు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. చివరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం ఎంపిడిఓ సరళ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఈ కేసు నమోదు వెనుక ఓ లేవుట్ కు సంభందించిన అనుమతుల వద్ద వివాదమని తెలుస్తోంది. వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బందువులకు చెందిన లే అవుట్ ఉంది. ఈ లే అవుట్ ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. దానికి నుడా అనుమతులు కూడా ఉన్నాయి. అంత వరకూ అటుంచితే.. ఆ లే అవుట్ కు పంచాయితీ వాటర్ పైప్ లైన్ పొడిగించాలని లే అవుట్ యజమాని వెంకటాచలం ఎంపిడిఓ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ మండలానికి చెందిన వైసీపి నేత ఒకరు ఏదో ఆశించి దానికి వాటర్ పైప్ లైన్ అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుపడ్డారని తెలిసింది. ఇదంతా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డి కి తెలిసే జరిగిందని ప్రచారం. దీనిపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎందుకు వాటర్ పైప్ లైన్ కు అనుమతి ఇవ్వడం లేదని పదే పదే అడిగినట్లు తెలిసింది. ఇది చిలికి చిలికి గాలివానలా మారి బంధువులైన ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ మారినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే తన ఇంటిపై దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపిడిఓ సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆయనపై కేసు నమోదు కావడం జరిగిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇప్పటి నుండే కాకుండా గతంలో నుండే సఖ్యత లేదని పార్టీలో అంతర్గత చర్చ సాగుతుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షులుగా నిర్ణయించకముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం శ్రీధర్ రెడ్డి… కాకాణికి గట్టి పోటీనే ఇచ్చినట్లు అంటున్నారు. అయితే చివరికి కాకాణి గోవర్ధన్ రెడ్డే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేధాలు ఉన్నట్లు అంటున్నారు. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత పోరు అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!