November 12, 2019

కాషాయ కండువా కప్పుకున్న టిడిపి ఎమ్మెల్సీ వాకాటి – మోడీతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి బిజేపిలో చేరారు. సిబిఐ కేసులో 18 నెలల పాటూ జైలు జీవితం గడిపి బెయిల్ పై ఇటీవలే వచ్చిన వాకాటి గురువారం ఢిల్లీలో పార్టీ నేత రాం మాధవ్ సమక్షంలో కాషాయ పండువా కప్పుకున్నారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఒకే దేశం – ఒకే జెండా అని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు. మోడీ వల్లే భారత దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఏపిలో కూడా బిజేపి బలమైన శక్తిగా మారబోతుందని అంటూ మోడీ అభివృద్ధిపై ఆకర్షితుడినై బిజేపిలో చేరినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుజిల్లాకు చెందిన వాకాటి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 2014లో రాష్ట్ర విభజనతో ఏపిలో కాంగ్రెస్ కుదేలవడంతో తెలుగుదేశంపార్టీలో చేరారు. తర్వాత స్థానిక సంస్థల కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందిన కేసులో బెంగుళూరు సిబిఐ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. మూడు దఫాల పాటూ నెల్లూరులోని వాసి నివాసాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. తర్వాత వాకాటి నారాయణ రెడ్డి ని సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో తెలుగుదేశం ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. 18 నెలల పాటూ బెంగుళూరులోని పరప్పర అగ్రహారం జైల్లో ఉన్న వాకాటి, ఇటీవలే సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. గురువారం బిజేపిలో చేరిపోయారు. సిబిఐ కేసుల నేపద్యంలో బిజేపిలో చేరినట్లు వార్తలొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!