November 19, 2019

వరకవిపూడి చెరువు ఆక్రమణల తొలగింపును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ – గిరిజనులకు న్యాయం చేస్తానని హామీ

Clock Of Nellore ( TP Gudur ) – నెల్లూరుజిల్లా, టిపి గూడూరు మండలంలోని వరకవిపూడి చెరువు ఆక్రమణల తొలగింపును జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు మంగళవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగితో కలిసి అక్కడకు చేరుకున్న కలెక్టర్ చెరువును పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. మొత్తం చెరువు విస్తీర్ణం, ఆక్రమణలు, తొలగింపుల వివరాలపై ఆరా తీశారు. ఇరిగేషన్ అధికారులు తెలిపిన దాని ప్రకారం వరకవిపూడి చెరువు మొత్తం విస్తీర్ణం11 వందల ఎకరాలు. ఈ చెరువు నుండి 15 వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. కాలక్రమంలో చెరువు ఆక్రమణకు గురైంది. కొందరు స్థానిక గిరిజనులు చెరువులోని కొంత భాగాన్ని ఆక్రమించుకుని వరి సాగు చేసుకుంటుండే వారు. దానిపై కొందరు పెద్ద కన్నేసి గిరిజనుల నుండి చెరువు భూములను క్రమంగా తమ వశం చేసుకున్నారు. చెరువులో రొయ్యలు, చేపల గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో 11 ఎకరాల చెరువు 200 ఎకరాలకు కుదించుకుపోయింది. అంతే కాకుండా చేపలు, రొయ్యల సాగు చేపడుతున్న అక్కడున్న పెద్దలు ఆ గుంతల్లోని నీటిని చెరువులోకే వదిలేస్తున్నారు. రసాయనాలతో కూడిన నీరు చెరువులోకి వెళ్లి అక్కడి నుండి పొలాల్లోకి వెళ్తుండటంతో దిగుబడి తగ్గి రైతులు నష్టాల పాలవుతున్నారు. దీనిపై ఇటీవల ఆయకట్టు రైతులు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శేషగిరిబాబుకు ఫిర్యాదు చేశారు. చెరువులో ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారం క్రితం చెరువులో ఆక్రమిత చేపలు, రొయ్యల గుంతలను తొలగించారు.

చెరువుకు సంబంధించిన 11 వందల ఎకరాల్లో ఎవ్వరూ ఎలాంటి సాగు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు అదే చెరువులో వరిసాగు చేసుకుంటున్న కొందరు గిరిజనులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుండి తాము అక్కడ వరిసాగు చేస్తున్నామని ఉన్న పళంగా నిలువరిస్తే తమకు దారి ఏదని విన్నవించారు. గిరిజనుల విన్నపంతో మంగళవారం ఎస్పీతో కలిసి కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక గిరిజనులు, ఆయకట్టు రైతులతో మాట్లాడారు. చెరువులో ఆక్రమణల తొలగింపు విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఆ పొలాల్నే నమ్ముకుని ఉన్న గిరిజనులకు ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తొలగింపు ప్రక్రియలో ఎవరైనా నష్టపోయి ఉంటే వారికి కూడా పరిశీలించి తగిన న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. దానిపై ఆర్డీఓ స్థాయి అధికారితో కమిటి వేస్తానని, ఆ కమిటి విచారణ జరిపి ఇచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అప్పటి వరకూ చెరువు స్థలంలో ఎవ్వరూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని హెచ్చరించారు. ఈ విషయంలో రైతులు గొడవలు పడవద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!