November 16, 2019

చంద్రబాబును జైల్లో పెట్టించడం మీ వల్ల కాదు – వైసీపిపై మండిపడ్డ కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును జైల్లో పెట్టించడం ఎవరి తరం కాదని నుడా మాజీ ఛైర్మైన్, టిడిపి నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబును త్వరలోనే జైలుకు పంపుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబుపై వైసీపి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. చంద్రన్న భీమా, బీసీ రుణాలు, పెళ్లి కానుక, పసుపు కుంకుమ, అన్నా క్యాంటీన్లు, అమరావతి నిర్మాణం చేసినందుకేనా చంద్రబాబును జైల్లో పెట్టిస్తామంటున్నారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి జగన్ 16నెలలు జైల్లో ఉన్నారని, చంద్రబాబు విషయంలో భూతద్దం పెట్టి వెదికినా అవినీతి ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. ఇసుక కొరత వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చావులను కూడా రాజకీయంగా వాడుకోవడం వైసీపికి మొదటి నుండి అలవాటేనని, వైసీపి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబును జైల్లో పెట్టించాలని శ్రీనివాసులురెడ్డి సవాల్ విసిరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భూమిపై వర్షం పడినట్లు వైసీపి నేతలు మాట్లాడుతున్నారని అంటూ అంతకు ముందు వర్షాలు లేవా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి హరిబాబు యాదవ్, జెన్ని రమణయ్య, ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!