November 21, 2019

పిల్లల ముందే భార్యను కడతేర్చిన కసాయిని అరెస్ట్ చేసిన నాయుడుపేట పోలీసులు

Clock Of Nellore ( Naidupet ) – భార్యపై అనుమానంతో పిల్లల ఎదుటే భార్యను నరికి చంపిన కసాయి భర్తను, హత్య తరువాత భార్య శవాన్ని కాల్చేందుకు సహకరించిన బంధువులను నెల్లూరుజిల్లాలోని నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వివరాల్లో కెళ్తే… నాయుడుపేట మండలం, పద్దిగుంట కండ్రిగ గ్రామానికి చెందిన పుట్టా మునిరాజ, ప్రమీలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. మేనకూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో మునిరాజా వాచ్ మెన్ పనిచేస్తుండగా భార్య ప్రమీల మరో కంపెనీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో కంపెనీలో పనిమాన్పించేశాడు. ఆ తరువాత కూడా భార్యపై అనుమానం పడుతూ నిత్యం ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలో మునిరాజా కూడా అనారోగ్యంతో పని మానేశాడు. ఈ నేపద్యంలో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మునిరాజా భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు బెడ్ రూంలో ఉన్నారు. బాత్ రూమ్ వెళ్లొచ్చిన ప్రమీలపై అనుమానం పడ్డ మునిరాజా బాత్ రూం వెదికాడు. అక్కడ నుండి రాగానే కిచెన్ లోని కత్తి తీసుకొచ్చి భార్య మెడపై శరీరంపై పొడిచాడు. అమ్మను చంపొద్దని పిల్లలు బ్రతిమిలాడినా వినకుండా హత్య చేశాడు. తరువాత వారి బంధువులకు విషయం చెప్పి తెల్లవారు జామున వారి సాయంతో ఎవ్వరికీ తెలియకుండా ప్రమీల మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లి దహనం చేశారు. దీనిపై గ్రామంలో అనుమానాలు తలెత్తడంతో పోలీసుల దృష్ఠికి తీసుకెళ్లారు. దర్యాప్తు జరిపిన పోలీసులు పిల్లలను, బందువులను విచారించగా భర్తే హత్య చేసి తరువాత దహనం చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. శుక్రవారం మునిరాజాతో పాటూ శవాన్ని దహనం చేసేందుకు సహకరించిన వారి బంధువులు పుట్టా ధర్మయ్య, వంటరి మల్లి, పుట్టా మనోహర్, మిడత సూరిబాబు, పుట్టా నాగరాజును నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. గూడూరు డిఎస్పీ భవానీ హర్ష నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయుడుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!