November 16, 2019

రెండేళ్ల తర్వాత అధికారిక కార్యక్రమానికి – అందర్నీ పలకరించిన ఎమ్మెల్సీ వాకాటి

Clock Of Nellore ( Nellore ) – బిజేపీ నాయకులు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి రెండేళ్ల తర్వాత అధికారిక కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. నెల్లూరులోని గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశానికి ఆయన హాజరయ్యి అందర్నీ పలకరించారు. ముందుగా పోడియం పైకెళ్లి మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ ను పలకరించారు. తర్వాత ఎమ్మెల్యేల వద్దకెళ్లి కరచాలనం చేస్తూ వారితో మాటామంతి కలిపారు. 2017వ సంవత్సరం మే నెలలో ఆయనపై బెంగుళూరులో సిబిఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. తప్పుడు ధృవపత్రాలతో వివిధ బ్యాంకుల నుండి రుణాలు పొందినట్లు ఆయనపై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు ఆ తర్వాత నెల్లూరులోని ఆయన నివాసంతో పాటూ సూళ్లూరుపేటలో కూడా సోదాలు నిర్వహించారు. సిబిఐ కేసు నేపద్యంలో తెలుగుదేశం ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. రెండు దఫాల సోదాల అనంతరం సిబిఐ ఆయన్ను అరెస్టు చేసి బెంగుళూరులోని పరప్పర అగ్రహారం జైలులో ఉంచారు. సుమారు 18 నెలల పాటూ ఆయన జైలు జీవితం గడిపారు. సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో గత నెలలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి జైలు నుండి విడుదలయ్యారు. వెను వెంటనే ఆయన బీజేపి తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపి తీర్ధం పుచ్చుకున్న తర్వాత అధికారిక కార్యక్రమాలు కొన్ని జరిగినప్పటికీ ఆయన దూరంగానే ఉన్నారు. తాజాగా ఐఏబి సమావేశానికి హాజరయ్యి ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని పరోక్షంగా చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!