November 21, 2019

సాగుపై సమగ్ర చర్చ – రైతాంగ సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షా కమిటి సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గాల్లోని రైతాంగ సమస్యలపై మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ముందుగానే మద్దతు ధరను ప్రకటిస్తే దళారుల నుండి రైతులను కాపాడిన వారమవుతామని చెప్పారు. పంటలను నిల్వ చేసుకోవడానికి గోదాముల సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మట్లాడుతూ ఎన్.ఎల్.ఆర్ – 34449 రకం వరి విత్తనాలపై రైతులు ఆసక్తి కనబరుస్తున్న దృష్ఠ్యా వాటి నిల్వలను పెంచాలని సూచించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంచినీటి పథకానికి ముఖ్యమంత్రి జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేశారని అయితే నిధుల విడుదలకు సంభందించిన ఉత్తర్వులు ఇప్పటి వరకూ విడుదల కాలేదని విన్నవించారు. ధ్వంసమైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని, రైతులకు విత్తనాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద రావు మాట్లాడుతూ 90 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను చెరువుల పేరుతో రైతుల నుండి తీసుకోవడం న్యాయం కాదని, చుక్కల భూములను రైతులకు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కావలి నియోజకవర్గంలో రైతు భరోసా నిధులపై ఆంక్షలు విధించారని ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ కు ప్రభుత్వం 50లక్షలు మాత్రమే కేటాయించారని, దాన్ని 2కోట్లకు పెంచాలని అభ్యర్ధించారు. అది కేవలం ఫెస్టివల్ మాత్రమే కాదని, టూరిజన డెవలప్ మెంట్ కు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మట్లాడుతూ రైతు భరోసా నిధులు మంజూరు కావడం లేదని, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఎక్కడ పనిచేసే వైద్యులు అక్కడే నివాసం ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో విష జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని దానికి సరిపడా మందులు అందుబాటులో లేవని చెప్పారు. అనంతరం వీరు తెలియజేసిన సమస్యలపై మంత్రులు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!