November 21, 2019

ఉగాది నాటికల్లా అందరికీ ఇళ్లస్థలాలు – నెల్లూరు రూరల్ సభలో మంత్రుల వెల్లడి

Clock Of Nellore ( Nellore Rural ) – వచ్చే ఉగాది నాటి కల్లా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని నెల్లూరుజిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంత్రులు డాక్టర్ పి. అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. సౌత్ మోపూరులో 27లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అలాగే పొదుపు మహిళలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో బాలినేని మట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉగాది నాటికి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామన్నారు. సౌత్ మోపూరు గ్రామంలోని బిసి కాలనీలో నెలకొన్న విద్యుత్ లైన్ సమస్యను వారంలోగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ యాదవ్ మట్లాడుతూ ఆమంచర్ల, కొమ్మరపూడి, అప్పయ్య కండ్రిగ గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తామని త్వరలోనే దానికి శంఖుస్థాపన చేస్తానని చెప్పారు. ఆమంచర్ల గ్రామంలో 8కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి ఈ ఏడాది దాదాపు 15 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి అనీల్ వెల్లడించారు. పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్ధన మేరకు శాప్ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన భూమిని, నిర్మాణం ప్రారంభించే వరకూ ఆ భూమిలో సాగు చేసుకునేందుకు కూలీలకు అనుమతినిచ్చే విషయంపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ సౌత్ మోపూరు గ్రామం నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ఎప్పుడో నిర్మించిన వంతెన దెబ్బతిని ఉందని దాని స్థానంలో కొత్తది నిర్మించాలని మంత్రులను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!