November 19, 2019

చంద్రబాబు దత్తపుత్రుడే పవన్… అది లాంగ్ మార్చ్ కాదు… రాంగ్ మార్చ్… మంత్రి అనీల్ ధ్వజం

Clock Of Nellore ( Thadepalli ) – గత నాలుగు నెలల నుండి రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో వరద కొనసాగుతున్న దృష్ఠ్యా ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవమేనని మరో 15 రోజుల్లో ఇసుక లభ్యత సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇసుక కొరతను ఏ విధంగా అధిగమించాలో సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ మనుగడ కోసం లాంగ్ మార్చ్ పేరుతో రాంగ్ మార్చ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపి ప్రధాన కార్యక్రమంలో శనివారం మధ్యాహ్నం మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, కన్నబాబు మీడియాతో మాట్లాడారు. అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుండి జనసేన పార్టీ పరిస్థితిని గమనిస్తే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తుందన్న విషయం అందరికీ తేట తెల్లమవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నామని మరో 15 రోజుల్లో వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం తర్వాత ఇసుక లభ్యత సాధారణ స్థితికి వస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఇసుక దందాలు, మాఫియా నడిపిందని తమ ప్రభుత్వం అలాంటి వాటికి ఆస్కారం లేకుండా నూతన పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. దోపిడిని పూర్తి స్థాయిలో నిరోధించే ఈ పాలసీ అమల్లో తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందని వివరణ ఇచ్చారు.

చంద్రబాబు హయాంలో గత 5ఏళ్లు వర్షాలు లేవని, కరువు తాండవించిందని అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రకృతి పరవశించి పుష్కలంగా వర్షాలు కురిశాయని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో 86 శాతం రిజర్వాయర్లలో నీరు ఉన్నాయని, దైశానికి వెన్నెముక అయిన రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి అనీల్ చెప్పారు. ఇసుక లభ్యమయ్యే రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుందని దాని కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లలో ఇసుక మాఫియా దందా కొనసాగితే పల్లెత్తుమాట కూడా అనని పవన్ కళ్యాణ్… ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. లాంగ్ మార్చ్ విశాఖలో కాదని కృష్ణా, గోదావరి, వంశధాన నదుల ఒడ్డుపై చేపడితే పరిస్థితి తెలుస్తుందన్నారు. చంద్రబాబు దత్తపుత్రునిగా పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఇప్పటి వరకూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 100కి పైగా లారీలను సీజ్ చేశామని, తెలుగుదేశం హయాంలో కనీసం ఒక్క ట్రాక్టర్ అయినా పట్టుకున్నారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అందర్నీ విమర్శించే పవన్ కళ్యాణ్ ఆయన్ను మాత్రం విమర్శిస్తే పూనకం వచ్చినట్లు ఊగిపోతారని ఇకనైన సొంతంగా ఆలోచించి ముందుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు దర్శకత్వంలో పనిచేస్తే జీవితంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మంత్రి అనీల్ హితవు పలికారు. గత ఎన్నికల్లో మీతో కలిసి పోటీ చేసిన సిపిఎం, సిపిఐ పార్టీలు నేడు మీతో కలిసి పాల్గొనేందుకు నిరాకరిస్తున్నాయంటే మీ విధానాలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!