November 12, 2019

ఎమ్మెల్యే కోటంరెడ్డికి విఆర్ కళాశాల బాధ్యతలు – పరిశీలించి ప్రకటించిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ప్రతిష్ఠాత్మక విఆర్ కళాశాలతో పాటూ దాని అనుబంధ విద్యాసంస్థలకు అతి త్వరలోనే పూర్వ వైభవం తీసుకొస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం ఉదయం ఆయన విఆర్ కళాశాలను సందర్శించారు. కళాశాలకు చేరుకున్న మంత్రికి జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జేసీ వినోద్ కుమార్ విఆర్ విద్యాసంస్థలకు ప్రత్యేక అధికారిగా ఉంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, పూర్వ విద్యార్ధులతో కలిసి మంత్రి కళాశాలను పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో భేటీ అయ్యారు. నెల్లూరు నగర నడిబొడ్డులో ఈ కళాశాల ఉండటం అదృష్ఠమని అన్నారు. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన విఆర్ కళాశాల నేడు దీనావస్థకు చేరడం దురదృష్ఠకరమని వ్యాఖ్యానిస్తూ అతి త్వరలోనే కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా అనేక మంది న్యాయమూర్తులు, మేధావులు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు ఈ కళాశాలలో విధ్యనభ్యసించారని మంత్రి అనీల్ గుర్తు చేశారు. 15 రోజుల్లో విద్యాశాఖ మంత్రిని నెల్లూరుకు తీసుకొచ్చి కళాశాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయిస్తానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విఆర్ విద్యా సంస్థల పాలక మండలి రద్దయిందని త్వరలో నూతన పాలక మండలి ఎన్నిక జరగాల్సి ఉందని జేసీ మంత్రికి వివరించారు. దానికి సంభందించి 83మంది నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారని చెప్పగా, పాలక మండలి లేదన్న సాగుతో అభివృద్ధి ఆగిపోకూడదని… కళాశాల అభివృద్ధి కమిటి ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన పాలక మండలి ఏర్పాటయ్యేవరకూ విఆర్ కళాశాల పూర్వ విద్యార్ధి అయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటి కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. విఆర్ కళాశాల క్రీడా మైదానం ఇకపై క్రీడలకు మాత్రమే కేటాయించాలని ఇతర ఏ వాణిజ్య కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కళాశాల పూర్వ విద్యార్ధలు మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, సీతారామిరెడ్డి, రంగాచారి వెంకటేష్, కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!