November 19, 2019

ఆ విషయంలో శ్రీధరన్నే ఫస్ట్ – కోటంరెడ్డి, అనీల్ సమక్షంలో వైసీపిలో చేరిన టిడిపి నేతలు

Clock Of Nellore ( Nellore ) – కార్యకర్తల బాగోగులను దగ్గరుండి చూసుకునే విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరన్నే ఫస్ట్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. రెండవ స్థానంలో తాను ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలను మంత్రి అనీల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపిలోకి ఆహ్వానించారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీ నేతగా ఉన్న వేమిరెడ్డి అశోక్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షురాలు వేమిరెడ్డి కౌసల్యమ్మ, ఆమంచర్ల గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, టిడిపి రూరల్ మండల ఉపాధ్యక్షులు పులి రామ్ గోపాల్ తో పాటూ వారి అనుచరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వారంతా మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి అనీల్ మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కి 100 శాతం అన్నీ స్థానాలను వైసీపి కైవసం చేసుకుంటుందని అన్నారు. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశానని, అయితే కార్యకర్తలను బాగా చూసుకునే విషయంలో మొదటి స్థానం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరన్నదేనని స్పష్టం చేశారు. రెండో స్థానంలో తాను ఉంటానని చెప్పారు.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రూరల్ లో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు వచ్చాయని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రేమతో అందర్నీ కలుపుకుపోతున్నానని, ధ్వేషించే వాళ్లను సైతం ప్రేమిస్తే ఆ ప్రేమ ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందవచ్చునని అభిప్రాయపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్నీ పార్టీల నేతలను తాను వైసీపిలోకి ఆహ్వానిస్తున్నానని, పార్టీలో చేరే ప్రతీ ఒక్కరికీ గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ వైసీపి – బిజేపి మధ్యేనని కోటంరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు బాగుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతీ ఒక్కరి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!