November 19, 2019

కష్టాల్లో సోమశిల ముంపు గ్రామాల ప్రజలు – పంట పాడవడంతో ఆందోళనలో రైతులు

Clock Of Nellore ( Somasila ) – సోమశిల జలాలు కడప జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు శాపంగా మారాయి. ఒంటిమిట్ట మండలంలోని ఆరు గ్రామాలు, వందల ఎకరాలు పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమశిల జలాలు గత పది రోజులుగా దిగువకు వదులుతున్నా ముంపు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జలాశయంలో మరో రెండు టీఎంసీల నీరు నిల్వ చేస్తారనే సమాచారం అక్కడి ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. నెలరోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి జలాలు దిగువకు వదులుతున్నారు. ఈ నీటితో నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 74 టీఎంసీలకు చేరింది. మరో రెండు టీఎంసీల నీరు నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టులో నిల్వ ఉంచిన నీరు కడప జిల్లా ముంపు గ్రామాలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. కడపలోని ఒంటిమిట్ట, సిద్ధవటం, నందలూరు, అట్లూరు, గోకవరం మండలాల్లో 105 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రభుత్వం దశలవారీగా ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇస్తూ వస్తున్నా… ఒంటిమిట్ట మండలంలోని ఆరు గ్రామాల్లో పరిహారం అందాల్సి ఉంది. 2008- 2009 లో పేరూరు పంచాయతీ పరిధిలోని 594 ఎకరాలకు పరిహారం అందగా, మరో 17 ఎకరాలకు అందాల్సి ఉంది. గంగ పేరూరు పరిధిలోని ఐదు వందల ఎకరాలకు పరిహారం ఇవ్వగా, మరో 145 ఎకరాలకు ఇవ్వలేదు. పరిహారం అందని రైతులు పంటలు వేసుకోవచ్చని అధికారులు భరోసా ఇచ్చారు. వారి సూచన మేరకు ఏటా రైతులు ఇక్కడ వరి పంట వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏటా మాదిరిగా ఈసారి వరి పంట వేసుకున్న రైతులకు సోమశిల వెనుక జలాలు కన్నీటిని మిగిల్చాయి. నీటితో పొలాలన్ని మునిగిపోయాయి. గ్రామాల్లోకి భారీగా నీరు చేరి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. మరో పది పదిహేను రోజుల్లో కోతకు వచ్చిన పంట కళ్లముందే పాడవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అర్ధిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి వచ్చి చూసి, తమ గోడు పట్టించుకునే వారే లేరని మహిళలు వాపోతున్నారు. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అందాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తే కొంతమేరకైనా ఉపశమనం లభిస్తుందని ప్రభావిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!