November 16, 2019

చోరీ కేసుల్లో చెన్నై వాసిని అరెస్ట్ చేసిన మనుబోలు పోలీసులు – బంగారు నగలు స్వాధీనం

Clock Of Nellore ( Manubolu ) – నెల్లూరుజిల్లా, మనుబోలు మండలం, చెర్లోపల్లి గ్రామంలో ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీనా జరిగిన చోరీ కేసుల్లో నిందితునిగా ఉన్న చెన్నై వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని వ్యాసారంపాడుకు చెందిన మాబాషా, ఎన్నూరుకు చెందిన సూర్య అలియాస్ మిట్టాయి సూర్య అనే ఇద్దరు చెర్లోపల్లిలోని రెండు నివాసాల్లో చోరీకి పాల్పడ్డారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలోని సాంకేతిక విభాగం సహాయంతో గూడూరు రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు పోలీసులు నిందితులను గుర్తించారు. ఇద్దరు నేరస్తుల్లో ఒకరైన మాబాషాను శనివారం అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన సూర్య బాల నేరస్తుడు. ఓ హత్య కేసులో ప్రమేయం ఉండటంతో సూర్య తమిళనాడులోని చెంగల్పట్టు జువైనల్ హోంలో ఉన్నాడు. పట్టుబడ్డ నేరస్తుడి ద్వారా 2లక్షలా 50వేలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాలనేరస్తుడైన సూర్య ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని మిగిలిన సొత్తును కూడా రికవరీ చేస్తామని మనుబోలు పోలీసులు తెలిపారు. గూడూరు డిఎస్పీ భవానీ హర్ష శనివారం మనుబోలు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఇద్దరు నేరస్తులు చెడు అలవాట్లకు బానిసలుగా మారి రైళ్లలో చిన్న చిన్న దొంగతనాలు, సెల్ ఫోన్ చోరీలు చేసే వారని తర్వాత ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. బాలనేరస్తుడు సూర్యను కస్టడీలోకి తీసుకుని మిగిలిన సొత్తును కూడా రికవరీ చేస్తామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో గూడూరు రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి, మనుబోలు ఎస్సై సూర్య ప్రకాష్ రెడ్డి, చిల్లకూరు ఎస్సై అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!