November 12, 2019

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు – నెల్లూరులో అగ్నిప్రమాద భవనాన్ని పరిశీలించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని నెల్లూరుజిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నెల్లూరు చిన్నబజార్ లోని కనకదుర్గా మెటల్ స్టోర్ మూడవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టపాకాయలు పేల్చగా అగ్గిరవ్వలు మూడవ అంతస్తులో ఎగిసిపడి ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. మూడవ అంతస్తు మొత్తం అగ్నీ కీలల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలను అదుపుచేయలేక పోయారు. సోమవారం మధ్యాహ్నం వరకూ అగ్నికీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. చివరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన వాటర్ ట్యాంకర్లను కూడా అక్కడకు రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మరో వైపు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, నగర మాజీ మేయర్ అబ్ధుల్ అజీజ్, మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనున్న ఇళ్ల నుండి ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం దీనిపై కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. నివాస ప్రాంతాలు, ఇతర ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే విషయంపై త్వరలోనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్కూళ్లు, కళాశాలలు తదితర భవనాల్లో ఖచ్చితంగా అగ్ని మాపక నిరోధక పరికరాలు అమర్చేవిధంగా రూపకల్పన చేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!