November 21, 2019

రాజ్యాంగబద్ద పరిపాలన ఈ ప్రభుత్వానిది – గ్రామ సచివాలయ సిబ్బంది శిక్షణలో ఆనం వెల్లడి

Clock Of Nellore ( Venkatagiri ) – గ్రామ స్వరాజ్యం రావాలని మహాత్మాగాంధీ కన్న కలలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నిజం చేశారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వెంకటగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామ సచివాలయ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో ఆనం మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం కోసం జాతిపితి మహాత్మాగాంధీ ఎంతో తపించారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో గ్రామ స్వరాజ్యం ఏర్పడాలని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. అయితే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దానిపై ఎవ్వరూ ఆలోచన చేయలేదని అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే భారత దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతే కాకుండా సచివాలయాల్లో లక్ష 70వేల మందికి ఒకే సారి ఉద్యోగ అవకాశాలు కల్పించారని వివరించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. సచివాల సిబ్బంది ప్రజలు మంచి సేవలు అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా సమర్ధవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!