November 16, 2019

మా విధానాల వల్లే సమగ్ర సోమశిల… ఆ జీఓను రద్దు చేయండి… సోమిరెడ్డి డిమాండ్

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అనేక విధానాల వల్లే నేడు సమగ్ర సోమశిల కల సాకారమైందని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా చరిత్రలో తొలిసారిగి సోమశిల 78 TMCలకు చేరడం సంతోషంగా ఉందన్నారు. తాము తీసుకున్న అనేక చర్యల వల్లే అది సాధ్యమైందని వెల్లడించారు. నెల్లూరులోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో గురువారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో కలిసి 146 TMCల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశం ఉన్న ఏకైక జిల్లా నెల్లూరు అని వివరించారు. ఇంత నిల్వ సామర్ధ్యం కలిగి ఉండటం ఒక చరిత్ర అని, అది నందమూరి తారక రామారావు సృష్ఠి అని చెప్పారు. సోమశిలకు సంబంధించి 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అటవీ, వైల్డ్ లైఫ్ అనుమతులు తమ ప్రభుత్వ హయాంతో సాధించామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9న తుది అటవీ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఫలితంగా సోమశిలలో 78 TMCల నీటిని నిల్వ చేసుకోగలిగామని చెప్పారు. 2015లో తెలుగుగంగ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి జిల్లాలో లక్ష నుంచి 2.30 లక్షల ఎకరాలకు ఆయకట్టును పెంచామని, రెండు ప్రాజెక్టుల పరిధిలో అటవీ అనుమతుల సాధనతో మూడేళ్లలో 2లక్షల ఎకరాలకు పైగా అదనపు ఆయకట్టు తీసుకొచ్చి చూపించామని సోమిరెడ్డి తెలియజేశారు. అనుభవజ్ఞులైన అధికారులతో చర్చించి అందుబాటులో ఉన్న జలాలను సద్వినియోగం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను కోరారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీడియా ప్రతినిధులను జైల్లో పెడతామంటూ తీసుకొచ్చిన జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారనే భయంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 నెలలుగా అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు అధికారమిస్తే టిడిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని సోమిరెడ్డి విమర్శించారు. సీనియర్లు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చి పరిపాలనను గాడిలో పెట్టాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!