November 21, 2019

జగన్ కేసులో కోర్టు తీర్పు హర్షనీయం – కేసును త్వరగా తేల్చాలన్న సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఆర్ధిక నేరాల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సిబిఐ కోర్టు ప్రజలందరూ కోరుకున్న తీర్పును ఇచ్చిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దేశానికి అధ్యక్షులైనా, పంచాయితీ సర్పంచ్ అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆర్ధిక నేరాల కేసులో చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయం కోర్టు తీర్పుతో స్పష్టమైందని వెల్లడించారు. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన నేపద్యంలో నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశంలో న్యాయవ్యవస్థ అందరికీ సమానమనే తీర్పు రావడం అభినందనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటూ ఆయన బృందంలో ఇప్పటికీ మార్పు రాలేదని సోమిరెడ్డి ఆక్షేపించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో శుక్రవారం కోర్టుకు హాజరైతే 60 లక్షలవుతుందని తప్పుడు సమాచారం ఇచ్చారని అది కూడా నేరమేనని అన్నారు. కేసు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైన కేసు అని ఎంత ఖర్చు అయినా సొంతంగా పెట్టుకోవాల్సిందేనని వివరించారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నా గన్నవరం నుంచి హైదరాబాద్ కు 5 లక్షలకు మించదని, ముఖ్యమంత్రిగా కల్పించాల్సిన రక్షణ ఖర్చు 3లక్షలకు మించదని సోమిరెడ్డి పేర్కొన్నారు. సిబిఐ కోర్టు తీర్పు నేపద్యంలో జగన్ రాజీనామా చేయాలని అనేక మంది కోరుతున్నారని, కానీ ఇవి పాత రోజులు కాదని అయినప్పటికీ ఆ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి అయన వ్యక్తి పేరును కోర్టులో పిలిస్తే వెళ్లి బోనులో నిలబడటమంటే విలువలకు తిలోదకాలిచ్చినట్లేనని… ప్రజా ప్రతినిధుల కేసుల్లో ఏడాది లోపు తీర్పు ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, కానీ ఆ తీర్పు సక్రమంగా అమలు కావడం లేదని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు పక్కాగా అమలు కావాలని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంభందించిన అన్నీ కేసుల విషయాల్లో కోర్టు విచారణ త్వరగా పూర్తి చేయాలని తాము కోరుకుంటున్నామని సోమిరెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!