November 12, 2019

వైఎస్ తలపెట్టారు… జగన్ పూర్తి చేస్తున్నారు… సచివాలయ ప్రారంభోత్సవంలో ఆనం వెల్లడి…

Clock Of Nellore ( Rapur ) – వెంకటగిరి నియోజవర్గ అభివృద్ధికి 10 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేశారని అయితే ఆ తర్వాత అన్నీ కనుమరుగయ్యాయని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తండ్రి చేపట్టిన ప్రణాళికలను కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి కాబోతున్నాయని స్పష్టం చేశారు. నియోజవర్గంలోని రాపూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా పెంచలకోన లోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహా స్వామి వారి దేవస్థానంలో ఆనం పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్ధం హోటల్ డి.ఆర్. ఉత్తమ్ అధినేత కొడవలూరు ధనుంజయ రెడ్డి దాతృత్వంతో నిర్మించిన షెల్టర్స్ మరియు లైటింగ్ ను రామ నారాయణరెడ్డి ప్రారంభించారు. తరువాత గోనుపల్లి గ్రామానికి చేరుకుని నూతన గ్రామ సచివాలయ భవనాన్ని మరియు అంగన్ వాడీ కేంద్రాన్ని పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అటవీ శాఖకు సంభందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. తదుపరి పెనుబర్తిలో సచివాలయ భవనాన్ని ప్రారంభించి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు బాలామృతం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా సోమశిల – స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. దీనిపై ఇప్పటికే అధికారులతో మాట్లాడటం జరిగిందని త్వరలోనే ఆ కాలువను పూర్తి చేసి నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కలువాయి, రాపూరు, డక్కిలి మండలాలకు నీటి ఎద్దడి లేకుండా చేయనున్నామని ఆనం స్పష్టం చేశారు. ఇవే కాకుండా వెంకటగిరి నియోజవర్గ అభివృద్ధికి అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేశారని అయితే ఆయన మరణం తర్వాత అవన్నీ నిలిచిపోయాయన్నారు. వైఎస్ కుమారుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని దేశంలో ఎవ్వరూ చేయలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించి ప్రజలకు చెందాల్సిన అన్నీ పథకాలను వారి ముంగిటకే తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో వీరితో పాటూ కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి, గోనుపల్లి రవీందర్ రెడ్డి, చెన్ను బాలకృష్ణారెడ్డి, అనీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!