December 16, 2019

నెల్లూరులో డ్రగ్స్ మాఫియా – ఇద్దరు విదేశీయులు… మరో ఇద్దరు స్వదేశీయులు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) – చెన్నై మరియు బెంగుళూరు కేంద్రాలుగా సాగుతున్న డ్రగ్స్ మాఫియా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు. నెల్లూరుజిల్లాలోని వివిధ కళాశాలల్లో విద్యార్ధులు డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందుకున్న ఎస్పీ ఐశ్వర్య రస్తోగి దానిపై దర్యాప్తుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు డ్రగ్స్ ఎక్కడి నుండి అందుతున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు అనే వాటిపై రహస్య విచారణ చేపట్టారు. ఈ నేపద్యంలో చెన్నై మరియు బెంగుళూరు నుండి డ్రగ్స్ నెల్లూరుకు వస్తున్నట్లు గుర్తించారు. నెల్లూరు చిన్నబజార్ కు చెందిన సాదిఖ్ ద్వారా బెంగుళూరులో ఉంటున్న నైజీరియా దేశస్తుడు శ్యామ్యుల్ ఉచే, గినీ బిసూ దేశానికి చెందిన యెహీరమ్ నునెస్, చెన్నైకి చెందిన లక్ష్మీ నారాయణలు ఆన్ లైన్ ద్వారా నెల్లూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై నిఘా ఉంచిన పోలీసులు సోమవారం ముత్తుకూరులోని గోపాలపురం జంక్షన్ వద్ద ఆ నలుగురు ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న MH-04 EQ 5402 నంబరు కలిగిన టయోటా కారును, అందులో ఉన్న డ్రగ్స్ కొకైన్, LSD, MDMA లను స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరుకు చెందిన సాధిక్ రావూస్ డిగ్రీ కళాశాలలో బిసిఏ చదువుతున్నాడు. కేసు పురోగతి కోసం సాధిక్ ను విచారించగా తాను డ్రగ్స్ కు బానిసనయ్యానని, అంతే కాకుండా నెల్లూరులో అందరికీ డ్రగ్స్ తానే అందిస్తుంటానని చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు. దీనిపై సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలియజేశారు. దీనికి సంభందించి కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నెల్లూరులో డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువతను గుర్తించడం జరిగిందని, వారికి మానసిక వైద్య నిపుణుల ద్వారా ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసును చేధించిన నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి, కృష్ణపట్నం సిఐ ఖాజావలి, సిఐ శ్రీనివాసన్, ఎస్సైలు శివ కృష్ణారెడ్డి, బాబీ, శ్రీనివాసులురెడ్డి, హనీఫ్ లను అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!