January 23, 2020

నెల్లూరులో నకిలీ విలేకరులు – 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – తాము విలేకరుల మంటూ కొందరు… ఎస్పీ కార్యాలయం నుండి వచ్చిన పోలీసుల మని మరికొందరు కలిసి అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే వారిని బెదిరించి నగదు గుంజే ముఠాను నెల్లూరులోని దర్గామిట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారితో పాటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మరో నలుగుర్ని కూడా అరెస్టు చేసి జైలు పంపారు. వివరాల్లో కెళ్తే… నగరానికి చెందిన సంపతి విజయ నిర్మల, చిలమత్తూరి సూర్య నారాయణ, పులిబోయిన హరిబాబు, పటాన్ జిలానీ, కిన్నెర నరేష్, గంధం మహేష్, పల్లం ఏసుపాదం, రోజా రాణి, ఆమె కుమారుడు కలిసి గ్రూపుగా తిరిగేవారు. ఇదే క్రమంలో ఈనెల 20వ తేదీనా పై 8 మంది వివిధ ఛానళ్ల పేరుతో ఉన్న లోగోలతో మాగుంట లే అవుట్ లోని డి మార్ట్ సమీపంలో ఓ ఇంటికి వెళ్లారు.

తాము వివిధ ఛానళ్లలో పనిచేసే విలేకరులమని కొందరు, తాము ఎస్పీ కార్యాలయ పోలీసుల మని మరి కొందరు వారిని బెదిరించారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని తమకు సమాచారం వచ్చిందంటూ 2 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే మీపై మీడియాలో వ్యభిచారం చేయిస్తున్నారని ప్రచారం చేస్తామని బెదిరించారు. దీంతో వారు అంతలేదు అని 70 వేలు ఇవ్వగా వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత ఈనెల 23వ తేదీనా అదే ఇంటిలో వ్యభిచారం జరుగుతుందని దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిఐ నాగేశ్వరమ్మ, ఎస్సై జిలానీ తమ సిబ్బందితో ఆ ఇంటికి వెళ్లి సోదారు నిర్వహించారు. వచ్చిన సమాచారం మేరకు అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయి. సైదాపురం మండలం, ఆదూరుపల్లి గ్రామానికి చెందిన మేదరమెట్ల భాలకృష్ణ, బాలాయపల్లికి చెందిన కోని మల్లీశ్వరి అనే ఇద్దరు తాము భార్యభర్తలమని చెప్పి ఆ ఇంటిని అద్దెకు తీసుకుని యువతులను అక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

పోలీసులు సోదాలు నిర్వహించే సమయానికి అక్కడ వీరిద్దరితో పాటూ బాలాయపల్లికి చెందిన నెల్లూరు అజయ్ కుమార్, నెల్లూరు నగరానికి చెందిన శ్రీరంశెట్టి గోపాల్ అనే వారు కూడా అక్కడే ఉన్నారు. అక్కడున్న నలుగుర్ని విచారించగా వ్యభిచారం చేయిస్తున్నట్లు అంగీకరించారు. వ్యభిచార కార్యకలాపాల కోసం తీసుకొచ్చిన ఓ యువతితో పాటూ అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. యువతిని ప్రొటెక్షన్ హోంకు తరలించి, నలుగుర్ని విచారించగా ప్రెస్, పోలీస్ పేరుతో తమ వద్ద రెండు రోజుల క్రితమే 8 మంది 70వేలు తీసుకున్నారని చెప్పారు. దీంతో ఆ 8 మందిని కూడా అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్ట్ చేశారు. దీనిపై నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ప్రెస్ పేరుతో బెదిరించి నగదు తీసుకున్న 8 మందితో పాటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నలుగుర్ని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రెస్ పేరుతో వ్యభిచార గృహంలోకి వెళ్లిన 8 మంది నెల్లూరు బ్రేకింగ్ న్యూస్ ( NBN ), నెల్లూరు పబ్లిక్ న్యూస్ ( NPN ), న్యూస్ 9, BN 9, CK న్యూస్, TV 4 ఛానళ్ల పేరు, ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పారన్నారు. వారంతా జర్నలిస్టులు కాదని వివిధ పేర్లతో లోగోలను తయారు చేసుకుని తిరిగే నకిలీ జర్నలిస్టులని డిఎస్పీ చెప్పారు.

నకిలీ విలేకరుల నుండి స్వాధీనం చేసుకున్న లోగోలు, ఐడి కార్డులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!