October 19, 2019

గతి తప్పిన నెల్లూరుజిల్లా క్రికెట్ అసోసియేషన్ … స్థానికేతరులకు అవకాశాలు… అవకాశాలు కోల్పోతున్న స్థానిక క్రీడాకారులు

Clock Of Nellore ( Nellore ) – కుక్క తోక వంకర అన్న చందంగా మారింది నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ దుస్థితి. ఇప్పటికే అనేక వైఫల్యాలతో విమర్శలను మూటగట్టుకున్న అసోసియేషన్… తాజాగా మరో తప్పిదానికి పాల్పడుతూ స్థానిక క్రికెటర్ల కన్నీళ్లకు కారణమవుతుంది. గతంలో క్రికెట్ క్లబ్బుల ఏర్పాటులో తమ మాయాజాలాన్ని ప్రదర్శించిన అసోసియేషన్ కార్యవర్గం, ఆ తరువాత నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలోని అసోసియేషన్ కార్యాలయాన్ని, ప్రాక్టీస్ పిచ్ ను మద్యపాన కేంద్రంగా మార్చిన విషయం జిల్లా క్రీడాకారులందరికీ తెలిసిందే. దానిపై అప్పటి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు అసోసియేషన్ కార్యవర్గానికి సంజాయిషీ నోటీసు కూడా జారీ చేశారు. ఈ విషయాలన్నింటితో పాఠాలు నేర్వని క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఒంటెద్దు పోకడలతోనే ముందుకెళుతుంది. నెలల తరబడి చదువును ఫణంగా పెట్టి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఎంపిక చివరి క్షణాల్లో మొండి చేయి చూపిస్తున్నారు. జిల్లాలో క్రికెట్ ప్రాక్టీస్ చేయని స్థానికేతరులను అప్పటికప్పుడు తీసుకొచ్చి మ్యాచ్ లకు వారిని ఎంపిక చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ నిర్వాకంతో స్థానిక క్రికెటర్లకు అవకాశాలు రాకపోవడంతో వారు నిరాశ, నిశ్రుృహలకు లోనవుతూ మానసికంగా వేదన చెందుతున్నారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో తమకు అవకాశాలే రావని రెప్పల కిందే కన్నీళ్లను దిగమింగుతున్నారు.

సాధారణంగా అయితే సెలక్షన్స్ ఎలా జరగాలి !
నెల్లూరుజిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లాలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించి యువ క్రికెటర్లను తయారు చేసి భారత దేశానికి అందించాలి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బిసిసిఐ ) కింద పనిచేసే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ( ఏసిసి ) ఆధ్వర్యంలో నెల్లూరుజిల్లా క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుంది. క్రికెట్ లో ప్రతిభ కనబరిచే వారిని జిల్లా అసోసియేషన్ గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తుంది. దీని కోసం నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రాక్టీస్ పిచ్ లు కూడా ఉన్నాయి. నెల్లూరులో సరాసరి 50 మంది వరకూ బాల బాలికలు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసే వారినే అండర్ – 14, అండర్ – 16, అండర్ – 19 కి మ్యాచ్ లకు ఎంపిక చేస్తారు. అండర్ – 14 రాష్ట్ర అసోసియేషన్ స్థాయిలో ఉంటుంది. మిగిలిన రెండు విభాగాల క్రికెటర్లను బిసిసిఐ పర్యవేక్షిస్తుంది. యూనివర్శిటీ స్థాయి, రంజీ ట్రోఫి మ్యాచ్ ఆడిన వారిని సెలక్టర్లుగా నియమించుకుని జిల్లా అసోసియేషన్ ఎంపికలు నిర్వహిస్తుంది. సెలక్టర్లు మొత్తం 16 మంది క్రీడాకారులను ఎంపిక చేస్తారు. ఆయా విభాగాల్లో ఎంపికైనా క్రీడాకారులు సౌత్ జోన్ ( నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ) పోటీల్లో మ్యాచ్ ఆడుతారు. సౌత్ జోన్ క్రికెట్ మ్యాచ్ లో ప్రతిభ కనబర్చిన 5 జిల్లాల క్రీడాకారుల్లో నుంచి 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసి మిగిలిన రెండు జోన్లలో కూడా ఎంపికైన జట్లతో మరో సారి మ్యాచ్ నిర్వహిస్తారు. మూడు జోన్ల నుండి ప్రతిభ కనబర్చిన క్రికెటర్లతో ఏపి స్టేట్ క్రికెట్ టీం తయారవుతుంది. అక్కడి నుండి ఇంటర్ స్టేట్ అక్కడ ప్రతిభ కనబర్చిన వారిని అండర్ 19 ఇండియా టీంలోకి ప్రవేశం కల్పిస్తారు.

అయితే నెల్లూరుజిల్లాలో ఏం జరుగుతుంది !
నెల్లూరుజిల్లాలో ప్రతిభ కనబర్చిన క్రికెటర్లను పక్కన బెడుతున్నారు అసోసియేషన్ నిర్వాహకులు. నెలల తరబడి ప్రాక్టీస్ చేసిన స్థానిక క్రీడాకారులను కాదని ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇష్టమొచ్చిన వారిని, తమ చెప్పుచేతల్లో ఉండే వారిని సెలక్టర్లుగా నియమించుకుంటున్నారు. సెలక్టర్లు కూడా అసోసియేషన్ చెప్పిన వారినే ఎంపిక చేస్తుంది. సాధారణంగా అయితే స్థానికేతరులకు అవకాశం లేదు. ఒక వేళ స్థానికేతరులకు అవకాశం కల్పించాలంటే పలు నిబంధనలు విధించింది బిసిసిఐ. ఎంపిక కావల్సిన జిల్లాల్లో ఆ క్రీడాకారుడు కనీసం రెండేళ్లు విద్యను అభ్యసించి ఉండాలి. అదే జిల్లాలో పుట్టి ఉండాలి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చదివి ఇక్కడ క్రికెట్ ఆడకూడదు. ఒక వేళ ఆ జిల్లాలో పుట్టి, వేరే ప్రాంతాల్లో స్థిర పడితే కనీసం రెండేళ్లు స్థానికంగా విద్యను అభ్యసించాలి. అంతే కాకుండా వారు ఉన్న జిల్లాల నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందాలి. కానీ నెల్లూరు జిల్లాలో అవేమీ అమలు కావడం లేదు. ఈ ఏడాది నెల్లూరుజిల్లా అండర్ – 16, అండర్ – 19 సెలక్షన్లు జరిగితే జిల్లాతో సంభందం లేని నలుగురు క్రీడా కారులను ఎంపిక చేసింది క్రికెట్ అసోసియేషన్. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను ప్రక్షాళన చేయాలని క్రికెట్ క్రీడాకారులు, అభిమానులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!