November 21, 2019

గన్నవరంలో సీపెట్ కేంద్రం ప్రారంభం – నెల్లూరుజిల్లాలో మరో కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ

Clock Of Nellore ( Gannavaram ) – కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక కేంద్రం నెల్లూరుజిల్లా నాయుడుపేటలో ఏర్పాటు కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ టెక్నాలజీకి సంభందించిన సెంటర్ ఫర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ( సీపెట్ ) మరో కేంద్రాన్ని నాయుడుపేట ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 50కోట్ల రూపాయలతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం, సూరంపల్లిలో నిర్మించిన సీపెట్ కేంద్రం, మరియు ఫ్యాక్టరీని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి సదానందగౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశానికి ప్లాస్టిక్ ఇప్పుడు ఓ సమస్యగా మారిందని అన్నారు. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ దాని పరిష్కారానికి కారణంగా నిలుస్తుందని చెప్పారు. అందుకే ప్లాస్టిక్ రీ సైక్లింగ్ టెక్నాలజీలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీపెట్ కేంద్రాన్ని ఏపిలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రంలో శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ఇదే కాకుండా నెల్లూరుజిల్లా నాయుడుపేటలో మరో సీపెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!