November 21, 2019

ఫలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నం – భవన నిర్మాణ కార్మికుల్లో ఆనందం

Clock Of Nellore ( Nellore ) – గత నాలుగు నెలలుగా నెల్లూరులో భవన నిర్మాణాలు లేవు. ఇసుక సరిగా లభ్యం కాకపోవడంతో నిర్మాణాలు 80 శాతం నిలిచిపోయాయి. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక అప్పుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. జిల్లా వాసులే కాకుండా భవన నిర్మాణ కార్మికులుగా నెల్లూరుకు వలస వచ్చిన వేలాది మంది శ్రీకాకుళం కూలీలు పనులు లేక ఇళ్లవద్దే ఉండాల్సిన దుస్థితి. నూతన ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ఆన్ లైన్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ నెల్లూరు వాసులకు ఇసుక లభ్యం కావడం లేదు. నో స్టాక్ అంటూ కంప్యూటర్ వెక్కిరిస్తోంది. అయితే నెల్లూరు ఇసుక మాత్రం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలకు తరలి వెళ్తోంది. మొదటి నుండి ఈ విషయాన్ని గమనిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదివరకే జిల్లా అధికారులతో చర్చించారు. నెల్లూరు నగర వాసులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ను కలిసి సమస్యను వివరించారు. నెల్లూరు ఇసుక నెల్లూరు వాసులకు దొరకడం లేదని ఇతర ప్రాంతాలకు వెళుతుందని ముఖ్యమంత్రికి చెప్పారు. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని, దాని అనుబంధ కార్మికులు కూడా ఉపాధి కోల్పోవలసి వస్తుందని సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి దృష్ఠికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాళెం రీచ్ నుండి ఇసుకను బయటప్రాంతాలకు తరలించకుండా ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని వారే పొట్టేపాళెం రీచ్ నుండి ఇసుకను పొందేందుకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అది కూడా కేవలం ట్రాక్టర్ల ద్వారానే తీసుకెళ్లాలని, టిప్పర్లు, లారీల ద్వారా తరలించరాదని సూచించారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తించి దాని పరిష్కారానికి చేసిన కృషి ఫలించడంతో నెల్లూరులోని వేలాది మంది కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!