January 23, 2020

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన బిశ్వభూషణ్‌

Clock Of Nellore ( Amaravathi ) – ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రతిపక్షనేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పలువురు ముఖ్య అధికారులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్రపతి నియమించారు.

బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1934 ఆగస్టు 3న రాజకుటుంబంలో జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ డిగ్రీ పూర్తి చేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరారు. ఆయనకు భారతీయ జనతాపార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 1980లో భాజపా ఒడిశా అధ్యక్షుడిగా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిశ్వభూషణ్‌ సేవలందించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. ఇందిరాగాంధీ పాలనపై ఒడిశా హైకోర్టు లాయర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1977లో ఇందిరకు వ్యతిరేకంగా ఒడిశాలో ప్రచారం నిర్వహించారు. 1990లో బిజూ పట్నాయక్‌ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1996లో ఒడిశా బీజేఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టారు. భాజపా,బీజేడీ ఉమ్మడి ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగారు.

మంగళవారం సాయంత్రమే కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. సాయుధదళాల గౌరవవందనం అందుకున్న ఆయనకు తర్వాత ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎస్‌ ఎల్వీ సబ్రమణ్యం, గవర్నర్‌ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!