November 16, 2019

చంద్రబాబు మళ్లీ రావాలని ఎవ్వరూ కోరుకోరు – రూరల్ రైతు భరోసాలో మంత్రి అనీల్ వ్యాఖ్య

Clock Of Nellore ( Nellore Rural ) – రాష్ట్రాన్ని ఐదేళ్లు అష్టకష్టాల పాలు జేసిన చంద్రబాబును మళ్లీ రావాలని మతిస్థిమితం లేని వాళ్లు తప్పా… ప్రజలెవ్వరూ కోరుకోరని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధనలక్ష్మిపురం కేజికే కళ్యాణ మండపంలో రైతు భరోసా కార్యక్రమం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి అనీల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు, వైసీపి నేతలు రూప్ కుమార్ యాదవ్, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా రూరల్ నియోజకవర్గానికి సంభందించిన రైతులు రైతు భరోసా చెక్కులను అందుకున్నారు. అనంతరం మంత్రి అనీల్ మాట్లాడారు. చంద్రబాబు మళ్లీ రావాలి అని తెలుగుదేశంపార్టీ నేతలు ఇటీవల ప్రచారం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మళ్లీ చంద్రబాబు ఎందుకు రావాలని ప్రశ్నించారు. పోలవరంతో పాటూ అమరావతి నిర్మాణం పేరుతో లక్షల కోట్లు అవినీతికి పాల్పడేందుకు చంద్రబాబు రావాలా అని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరిగిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 4 నెలలకే రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి అనీల్ గుర్తు చేశారు. ఐదేళ్ల టిడిపి పాలనలో ప్రజలు కరువును ఎదుర్కొన్నారని, జలాశయాలు మొత్తం చుక్కనీరు లేకుండా దర్శనమిచ్చాయని చెప్పారు. జగన్ రాగానే ప్రకృతి కూడా సహకరించి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్రంలోని అన్నీ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసాను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. జిల్లాలోని రైతులందరికీ రెండు పంటలకూ సాగు నీరు ఇస్తామని స్పష్టం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకం రైతులకు సంజీవిని లాంటిదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటిస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని టిడిపి నేతలు అప్పట్లో ఎద్దేవా చేశారని కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ అందించారన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకం ప్రకటిస్తే అప్పటి లాగే చంద్రబాబు సాధ్యం కాదన్నారని అయితే జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భరోసా ఇస్తున్నారని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!