November 21, 2019

సిఎం జగన్ నెల్లూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనీల్ – విజయవంతం చేస్తామని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 15వ తేదీనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగే సభ ద్వారా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా జిల్లాకు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. యూనివర్శిటీ ప్రాంగణంలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి అక్కడకు చేరుకున్న అనీల్ కుమార్ యాదవ్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఏర్పాట్లను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి అనీల్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరుజిల్లాకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో అత్యధిక సీట్లను వైసీపికి అందించిందని అలాగే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లను కూడా వైసీపికే అందించిందన్నారు. నెల్లూరుజిల్లా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అభిమానమన్నారు. అందుకే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు నుండి ప్రారంభించబోతున్నారన్నారు. సిఎం సభను అందరం విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!